Friday, February 22, 2008

మనుషుల స్వభావాలు-2

కొందరు తప్పనిసరి పరిస్థితులలో దిగులుపడతం సహజం. కొందరికి నుదుట బొట్టులా దిగులుంటుంది. ఎప్పుడూ దైన్యంగా కనబడుతున్నట్లు ఉంటారు. వాస్తవానికి వీళ్ళకు దిగులు ఉండదు, దిగులుకే వీళ్ళుంటారు. వారి ముఖం తీరు, ప్రవర్తన తీరు అలాగే వుంటాయి. ఇలాంటి వాళ్ళతో ఐదు నిమిషాలు మాట్లాడితే మనక్కూడా "దిగులు జబ్బు" అంతుకుంటుందనిపిస్తుంది.

తన వీధిలోకి వచ్చిన మరో బలవంతుడ్ని ఆ వీధి గూండా అంగీకరించలేడు. తనకన్నా ఎఫిషియెంటైన పోలీసాఫీసర్ని అతడి బాసే సహించలేడు. అంతెందుకు.....తన పరిధిలో ఆనందంగా బ్రతికే పులి సైతం అక్కడికో కొత్త పులి వస్తే తరిమేయాలనుకుంటుంది. ఉన్నవాడు లేనివాడిని దోచుకొనేది అతడు ఎప్పటికీ లేనివాడుగా మిగలాలనే తప్ప అతడిమీద అంతకు మించి కక్ష వుండదు.

లోకులు ఎదుటివారిలోని ఔన్యత్యాన్ని త్వరగా గుర్తించరు. కాని బలహీనతల్ని మాత్రం వెంటనే భుతద్దం లోంచి చూసి కావుకావుమనే అరుస్తారు. వారికదో ఆనందం. దాని వెనుక ఆత్మవంచన ఉందని వారికి తెలుసు. అయినా ఎదుటివారిని కించపరిస్తే తామేదో గొప్పవారైపోతారన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏనుగు వెళ్తూంటే కుక్కలు మొరగవా? అలా.

మరుసటి టపా లో ప్రేమ గురించి....అంతవరకు సెలవు.

Thursday, February 21, 2008

మనుషుల స్వభావాలు-1

ఇంకోకావిడా పూర్తిగా శాఖాహారులైన తన కోడలి పుట్టింటికి మాంసాహారుడైన తన కొడుకు ను పంపదట. వెళ్లాలనుకుంటే కోడలు ఒంటరిగా వెళ్ళవచ్చట. ఎందుకంటే తన కొడుకుకి మాంసం వండి పెట్టారని. పండుగ రోజు తనే తృప్తిగా వండి పెడుతుందట. ఏం? రొజూ తన కొడుకుకి మాంసం వండి తృప్తి గా పెట్టవచ్చు కదా!! పండుగ రోజే పట్టాలా??. కోడలు తరపువారు మాంసం తినరు అని తెలిసి ఎందుకు తెచ్చుకున్నట్లు వారిచ్చే కట్నం కోసం కాకపొతే??

ఈవిడే ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుంది. ఆరోజు ఆమె చేసే హడవిడి అంతాఇంతా కాదు. ఇంట్లో కుక్క పిల్ల మొదలుకొని ప్రతి ఒక్కటి శుభ్రంగా వుండలి. మిగతా రోజులలో ఈగలు ముసురుతున్నా పట్టించుకోదు. ఒక్కరోజు గుడికి వెళ్ళడానికే ఇంత నిష్ఠ పాటించే ఆమె, చిన్నప్పటినుండి మాంసం అలవాటు లేని తన కోడలు మాత్రం వారు వండి పడేసిన పాత్రలలోనే వండుకు తినాలి. ఎంత దారుణం!, ఎంత స్వార్థం!.

ఇంకొకావిడ తన పక్కింటి పంకజం తో చెబుతోంది..." మా అల్లుడు బంగారు కొండ, మా అమ్మాయి ఎలా చెబితే అలా నడుచుకుంటాడు, ఏది పెడితే అది తింటాడు, తనని చాలా బాగా చుసుకుంటాడు, పెత్తానం అంతా మా అమ్మాయిదే!!, నా కొడుకును చూస్తేనే బాధేస్తుంది. నా కోడలు ఆడించినట్లు ఆడుతాడు, ఆ రాక్షసి వాడిని కొంగుకు ముడేసుకుంది" అని. ఆహా!! కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా??

ఇంకొకామె తన కోడలు తనను ఎంత బాగా చూసుకున్నా, చక్కగా సంసారం చేసుకున్నా ఎదురింటి, పక్కింటి వారి కోడల్లతో పోల్చి లోపాలను ఎత్తి చూపందే తిన్నది జీర్ణం కాదు. మరి అలాంటప్పుడు వారి లాంటి వారినే(వారినే) కొడలుగా తెచ్చుకొని వుండవచ్చు కదా?.

పాపం కొత్త కోడల్లు! తను ఇప్పటి వరకు ఉన్న వాతావరణం నుండి వాతావరణం లోకి వచ్చి వారిథో సర్దుకొని తన జీవనయానాన్ని సాగించే ఎందరో నారిమనులు, అందరికి జోహారులు.

మరికొన్ని మరుసటి టపాలో..........

Monday, February 18, 2008

మనుషుల స్వభావాలు

మనకు నిత్య జీవితం లో రకరకాల మనస్తత్వాలు కల రకరకాల మనుషులు ఎదురవుతువుంటారు. అంతెందుకు మనలోనే మనం సంధర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తాం. కొన్ని సమయాలలో మంచిగా ప్రవర్తిస్తాం, మరి కొన్ని సమయాలలో మంచిగా ప్రవర్తిస్తున్నట్లు నటిస్తాం. ఇంకొన్ని సమయాలలో ఇంకో విధంగా ప్రవర్తిస్తాం.

నాకు తెలిసిన ఒకావిడ మనలను బాధ పెట్టె విషయం చెప్పాలనుకున్నప్పుడు "ఏమి అనుకోకండి" అని మొదలు పెడుతుంది. ఏమైనా అనుకొనే విషయమైతే చెప్పడమెందుకు, ఆ విషయం విన్న తరువాత మనం ఏమి అనుకోకుండా ఎలా వుండగలం?? మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పాలనుకున్నది చెప్పాను అన్నట్లు ఆమె వుద్దేశమేమో అనిపిస్తుంది.

ఈవిడే తన కోడలు తో అనాల్సిన మాటలు అన్నీ అనేసి "మళ్ళీ ఎవరితో అనకమ్మా, వాడితో(కొడుకు)కూడ అనకు" అంటుంది. కొడుకు కోడలు మధ్య అగాధం పెంచి, తనకోడలు ఆమె అన్న మాటలు జీర్ణించుకోలేక, తన భర్తతొ పంచుకోలేక బాధ పడుతుంటే చూసి ఆనందించడం ఈమె వంతు.
ఇంకొకావిడ తన కోడలు తరపు వారి తో "మా అమ్మాయికి అవి పెట్టాం, ఇవి పెట్టాం" అని గొప్పగా చెపుతుంది. మీ అమ్మాయి కీ మీరు అలా లేక అంతకన్నా ఎక్కువ గా పెట్టండని ఆమె చెప్పకనే చెపుతుంది. పాపం వారు ఇచ్చుకొనే స్థితిలో వుంటే సరే!! లేదంటే వారి??. పరిస్థితి?? ఐనా ఆమె ఎందుకంత గొప్పగా చెప్పుకుంటుందో అర్థం కాదు, ఆ పెట్టడం పెట్టింది వేరే ఎవరికో కాదుగా, తన సొంత కూతురికే గా, మరి గొప్పగా చెప్పుకోవడం దేనికి.

సశేషం........

Saturday, February 16, 2008

అందరికి నమస్కారం!!,

యురేకా....యురేకా......యురేకా
ఇది నా తొలి టపా. నాకు ఎలా బ్లాగా లో తెలిసి పొయిందోచ్చ్!!

మళ్ళీ నా వచ్చే టపా లో కలుద్దాం.. అంత వరకు సెలవు.