సుదీర్ఘమైన సమాసం
సమాసకల్పనకు భాషలో ఎంతో పాండిత్యం ఉండాలి. ఎంతో ప్రయోగానుభవం గడితేరాలి. పదాల ఉత్తరోత్తరాన్వయం తెలియాలి. బహునిఘంటు పరిజ్ఞానం కావాలి.
ఇన్నీ ఉన్నాక, అప్పుడు ఔచిత్యం ఉంటే రాణిస్తుంది. లేకుంటే, వట్టి ఆడంబరమని కొట్టిపారేస్తారు.
ఔచిత్యం ఉండకేమీ! రంగస్థలం పైని జూపూడి యజ్ఞనారాయణ గారు దుర్యోధనుడి వేషం కట్టి, తిరుపతి వెంకటకవుల పాండవోద్యోగ విజయాల్లోకి మక్కపాటి వెంకటరత్నం గారి మయసభ ఏకపాత్రాభినయం దృశ్యాన్ని జొప్పించి, నిండైన విగ్రహంతో –
ఉద్దండగదాదండాన్ని భుజాన దాల్చి,
మీసాలు మెలివేస్తూ,
మైకులు పగిలే ఉచ్చైఃస్వరంతో
“భవచ్చిత్తాటవీసంచరద్దురూహమత్తమాతంగవక్షఃకవాటవిపాట్య
పాటవోదగ్ర సింహకిశోర కరాంచలనఖాంచలము కాదా!
ఈ కురుసార్వభౌముని అద్భుతోపాయపరంపర.”
అంటున్నప్పుడు -
ఆ గాంభీర్యం, ఆ ఔదాత్యం, ఆ ఔద్ధత్యం, ఆ ధీరత్వం, ఆ ఆంగికం, ఆ వాచికం, ఆ రాజసం చూస్తుంటే మనమూ ఆ మయసభలోకి పయనమైపోయి ప్రేక్షకులం ఆనాటి ఆ సన్నివేశంలో వీక్షకులమే అయినట్లుండదూ?
శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియ రామరాజుకు మేనల్లుడైన తొరగంటి నరసరాజుకు అంకితంగా భట్టుమూర్తి కావ్యాలంకార సంగ్రహం చెప్పాడు. ఆ నరసరాజు సుతసామంతవితానంతో కొలువుతీరి సింహాసనంపైని కూర్చున్నప్పుడు ఎలా ఉన్నాడని?
వెండియుం బ్రచండభుజాదండతాండవితమండలాగ్రఖండితారాతిమండలుండును
(25 అక్షరాలు),
అఖండనవఖండపృథ్వీమండలధురాభరణపరాభూతఖండపరశుకుండలుండును
(31 అక్షరాలు),
అజాండకరండపిచండిలయశఃపూరకర్పూరహారుండును
(21 అక్షరాలు),
సరస్వతీమనోభండారచౌర్యకారుండును
(15 అక్షరాలు),
సమరసమయసముజ్జృంభితజంభారిదోస్స్తంభసముత్తంభితదంభోళిధారావిదారిత
మహాభీలశైలాళివిశాలారవకోలాహలలీలాహళహళికాసమారంభసుభగంభావుక గంభీరవిజయభేరీభయంకరభాంకారసంకరసముట్టంకితదిగ్విటంకుండును
(93 అక్షరాలు),
అక్షుద్రతరసురక్షోభకరమదోన్మత్తదక్షోన్నతరక్షోవక్షోపక్షోదవిచక్షణాక్షీణనృహర్యక్ష
రూక్షవీక్షణోద్భవదాశుశుక్షణిక్షణసముత్క్షిప్తకీలాకరాళా
విచ్ఛిన్నచ్ఛాయాచ్ఛటాపటిమఘటనచటులప్రతాపవైభవుండును
(82 అక్షరాలు),
ఉభయరగండ గండభేరుండాది బిరుదసందీపితప్రాభవుండును
(24 అక్షరాలు),
అసాధారణమేధావధీరితవేధోమేధోపబోధనిర్నిరోధమధురమధురసావధీరణ
సంగ్రహవాగ్గ్రథనసుధీజనగృహద్వారనిర్ణిద్రభద్రవారణఘటావికటకటాహతటపతదనూనదానాంభోఝరీపరిమళపరిలబ్ధిలుబ్ధలబ్ధామోదమేదురభృంగీతరంగితభంగీ
ప్రసంగతప్రసంగాంగీకృతనిరంతరదిగంతరవిశ్రాంతవిశ్రాణనజయానకుండును
(131 అక్షరాలు).
ఇంకా ఎన్నో విధాలుగా చెప్పాడు కవి.
సమాసం అంటే ఎలా ఉండాలి?
గుండె ఝల్లుమనిపించాలి.
వినగానే మనస్సు చల్లబడాలి.
అల్లసాని పెద్దన గారు చెప్పారు:
“… సంస్కృతంబు పచరించెడు పట్టున భారతీవధూ
టీతపనీయగర్భనికటీభవదాననపర్వసాహితీ
భౌతికనాటకప్రకరభారతభారతసమ్మతప్రభా
శీతనగాత్మజాగిరిశశేఖరసీతామయూఖమాలికా
పాతసుధాప్రపూరబహుభంగఘుమంఘుమఘుంఘుమార్భటీ
జాతకతాళయుగ్మలయసంగతిచుంచువిపంచికామృదం
గాతతతేహితత్తహితహాధితదంధణుధాణుదింధిమి
వ్రాతలయానుకూలపదవారకుహూద్వహహారికింకిణీ
నూతనఘల్ఘలాచరణనూపురఝాళఝళీమరందసం
ఘాతవియద్ధునీచకచకద్వికచోత్పలసారసంగ్రహా
యాతకుమారగంధవహహారిసుగంధవిలాసయుక్తమై
చేతముఁ జల్లఁజేయవలె …” అని.
“భారత వధూటీ” మొదలుకొని “యుక్తమై” వఱకు మొత్తం ఒక్క సమాసం.
మొత్తం 217 అక్షరాలు.
రాయలవారు గండపెండేరం తొడగకుండా ఉంటారా మఱి?
ఒక్క ప్రశ్న:
సమాసం సందర్భ విదర్భమా? కాదా?
ఔచిత్యవంతంగా ఉన్నదా? లేదా?
కవులు సమయోచితంగా ప్రయోగించారా? లేదా?
అర్థవంతమై సౌందర్యం నిండి ఉన్నదా? లేదా?
ఈ విషయాలన్నిటినీ ప్రక్కన పెట్టి,
పద్యమైనా, గద్యమైనా తెలుగులో ఇంతకంటె పెద్దదైన సమాసం ఉన్నదా?
2 comments:
Thanks sir. Bhaashaa soundary...ahaa..
అద్బుతః
Post a Comment