Tuesday, November 18, 2008

ప్రేమంటే ఇదేనా...............!!!

చాలా రోజుల తరువాత ఓ గొప్ప కళా'ఖండా'న్ని తిలకించి పులకించి పోయాను. కళా'ఖండం' పేరు ఉల్లాసంగా.... ఉత్సాహంగా.....! ఇందులో మాటలు ఎవరు వ్రాసారో తెలియదు కాని ఎంత చండాలంగా వున్నాయి అంటే............ నాయకుడు నాయిక తో ఇలా అంటాడు " " నేను స్నేహితులు అనుకున్న వారిని ప్రేమించలేను, నేను ప్రేమించే వారిని స్నేహితులు అనుకోలేను" అని. అంటే స్నేహితులను ప్రేమించలేడు, మరి ద్వేషిస్తాడా??..ద్వేషిస్తే స్నేహితులు ఎలా అవుతారు....?? ప్రేమించేవారితో స్నేహం చేయలేడు......మరి విరోదం పెట్టుకుంటాడా..??? బహుశ అందుకేనేమో జనాలు తాము ప్రేమించిన వారు తమను ప్రేమించడం లేదు అని పది మంది ముందు నిర్దాక్షణ్యం గా చంపిపడేస్తున్నారు. వీరు ఇలాంటి మాటలను విని ఆలాంటివి చేస్తున్నారా...??? లేక రచయితకు ప్రేమంటే తెలియదా???లేక ప్రేమంటే కేవలం సెక్స్ అనుకునే నీచ స్థాయికి దిగజారిపోయాడా???

ప్రేమ!........అపూర్వమైన మధురక్షణాలు.........ప్రకృతికి శోభనిచ్చే అలంకారం...........కాని ప్రేమన్నా, ప్రేమికులన్నా చాలా మందికి చులకన, వాళ్ళేదో తప్పుచేస్తున్నారన్న ముర్ఖపు ఆలోచన.........నిజమే!......దానిక్కారణం లేకపోలేదు. ప్రేమను వంచించే ప్రేమికులు..........ప్రేమనే దైవత్వాన్ని కత్తులతో పొడిచే పెద్దలు.....ప్రేమంటే కేవలం సెక్స్ అనుకొనే నీచులు...........ప్రేమంటే రెండు మనసుల కలయికని తెలియని నికృష్టులు..........ఇంతమంది మధ్య నలిగిపోవడం చేతనే ప్రేమకున్న దైవత్వం మైలపడిపోయింది.

ఇలాంటి డయలాగులు విని నేటియువతకు ప్రేమంటే సరియైన అర్థం తెలిక తప్పు దారిన నడుస్తోంది!.

Wednesday, November 12, 2008

ఇంతకు ముందు చెప్పుకున్నట్లు ఎన్నో వ్రాయాలనీ, నా మనోభావాలను అందరితో పంచుకోవాలనీ బ్లాగడానికి కూర్చుంటే తియ్యటి, కమ్మటీ మధురమైన ( అన్నింటికీ ఆర్థం ఒకటే :)) నా మాతృభాషలో పదాలే కరువైనట్లు, ఆలోచనా ఙ్ఞానం కోల్పోయినట్లు, ఊహలు స్తంభించినట్లు, అడుగు తీసి అడుగువేయలేని మత్తగజం లా ముందుకు సాగనంటోంది. రెప్పలవెనుక తియ్యటి స్వప్నం ఉప్పటి నీరులా ఉప్పోంగుతోందే తప్ప, ఊపిరి లోని మౌన భాష గుండె ఘోషను చెప్పలేకపోతోంది.

వేదనకు గురైన మనసు స్పందిస్తే వేసవిలో మల్లె అవుతుంది, విరక్తి చెందిన మనసు స్పందిస్తే విరిపై మంచు బిందువవుతుంది.మరి ఆనంద పడే మనసు ఆవేదనకు గురైతే ఆ మంచు మరిగి ఆవిరి అవుతుంది. ప్రస్తుతం నా పరిస్తితి అలానే వుంది. చాలా వ్రాయాలని ఆనందంతో వురకలు వేసే మనసును పొదివి పట్టి కూర్చుంటే ఆలోచనలు కరువై ఆవేదనే మిగిలింది.

Wednesday, November 5, 2008

పునరాగమణం


పునరాగమణం
================

ఆందరికి నమస్కారం.........!! చాలా రోజుల తరు
వా, అనేక తర్జన భర్జన ల తర్వతా మళ్ళీ బ్లాగాలని మొదలు పెట్టీ నేను సైతం బ్లాగ్లోకానికి బ్లాగునొక్కట్టి అందించాలని కుతూహళం ఎక్కువై ఏదో ఒకటి వ్రాసేయాలని, వీక్షించిన వాళ్ళందరినీ ఇబ్బందుల్లో పడేయాలని(చదివినా, చదవకపోయినా) నిర్ణయించుకున్నాక, ఒక సుముహుర్తం లో తీరిగ్గా వ్రాద్దామని పంచాంగం మొత్తం వెతికి మాంచి ముహుర్తం పెట్టీ వ్రాయలని కూర్చుంటే ఆలోచనలు స్తంభించినట్లు, అసలు అక్షరాలే రాని నిరక్షర కుక్షిలా తయారైంది నా పరిస్థితి. అదేంటో ఈ బ్లాగులోకం లోని బ్లాగులను చదువుతుంటే వెంటనే నాకు బ్లాగాలనిపించి తీరా బ్లాగడనికి కూర్చుంటే ఏమి బ్లాగాలో, ఎలా బ్లాగాలో (ఎలా మొదలెట్టాలో) దిక్కుతోచని అయోమయ పరిస్థితి లో కలిగిన భావ పరంపరల అక్షర రూపమే ఈ నా పునరాగమణం లోని మొదటిబ్లాగు.

ఇక్కడ బ్లాగోన్మ్హుఖంగా బ్లాగొదరి బ్లాగొదరులకు [సోదర సోదరీమనులకు పేరడి (సోదర/రి అంటే "సహ-ఉదరం" ఒకే ఉదరం పంచుకు పుట్టినవారు అని అర్థం)బ్లాగొదర/రి అంటే బ్లాగును అసరాగా చేసుకొని కలసిన సోదర/రి లన్నమాట]. తెలియజేయునది ఏమనగా మీ విమర్స్యలతోటి (సద్విమర్స్య కాని, దుర్విమర్స్య కాని)నన్ను ప్రోత్సహించి ( ఎవరికైనా తనగురించి ఇతరులు ఏమనుకుంటున్నరో తెలుసు కోవాలనే కుతూహలం వుంటుందటగా, అందులో నేను ఒకడిని) మీ సహాయ సహకారాలను అందించి ఎప్పుడిప్పుడే ఈ బ్లాగులోకంలో అక్షరాల అడుగులను నేర్చుకుంటున్న ఈ పిల్లగాడిని ఆశీర్వదిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటూ .................మళ్ళీ కలుద్దాం.

Saturday, April 12, 2008

ఆత్మీయులు

కొన్ని సంవత్సరాల క్రితం దురదర్సన్ లో ఆత్మీయులు అనే ధారావాహికం వచ్చేది. ఆ ధారావాహిక టైటిల్ సాంగ్ ఇది. వినడానికి ఎంతొ బాగుండేది, రచన ఎవరొ తెలియదు కాని పాడింది బంటి అనుకుంటాను...... ఆపాట మీ కోసం ఇక్కడ చేర్చడమైనది. మీరు ఆనందించంది.


ఎదలోగిలి కదలాడె ఒక రాగం ఒక భావం
మనసెరిగిన భాష ఇది ఒక లాస్యం ఒక భాష్యం
అభిమానం తీరమని
అనుభూతుల సారమని
ఒక గీతం సంగీతం
ఒక మౌనపరాగం ఒక సౌమ్యతరంగం ||2||
చమరించే కన్నులలో
చిరునవ్వులు ఆత్మీయులు ||2|| ||2||
ఎదలోపల తారాడె ఒక గంధం అనుభంధం
కనుపాపల లాలించే ఒక నాధం ఒక వేదం

Wednesday, March 5, 2008

ప్రేమంటే ఏమిటంటే.....!!! -2

"ప్రేమ" అనేది మధురానుభూతి. ప్రేమించుకునే వళ్ళకి మాత్రమే ప్రేమలోని తీయదనం అర్థమవుతుంది. నువ్వుంటే చాలు ఈ ప్రపంచమంతా ఏకపోయినా పర్వాలేదనిపించడం ప్రేమ. మన మధ్య దూరం తొలగిపోయి, మనం దగ్గరవ్వాలంటే భూమి కుచించుకు పోవాలి. జనం చస్తారంటావా? చావనీ పర్వాలేదు. మన ప్రేమ ముందు వాళ్ళెంత? పిపీలకాలు! అనుకోవడం ప్రేమ. అది వరకు వందసార్లు విన్న జోకే అయినా ప్రేమించిన వ్యక్తి చెప్తే పగలబడి నవ్వడం ప్రేమ.
"ప్రేమంటే ఒకరి కళ్ళలోకి ఒకళ్ళు చూసుకోవడం కాదు, ఇద్దరూ కలసి ఒకేవైపుకి చూడడం."

చిన్నపిల్లల కబుర్లకీ, ప్రేయసీప్రియుల కబుర్లకీ ఒక సామ్యం వుంది. రెండూ అర్థం పర్థం లేని స్వీట్ నథింగ్సే--ఒక టాపిక్ అంటూ ఉండాల్సిన పనిలేదు. అన్నీ విచిత్రంగా కనిపిస్తూంటాయి, పిట్టలు పైకి ఎలా ఎగురుతాయో దగ్గర నుంచీ కొమ్మలు తలలూపుతూ కదలటం దాకా, తేలిపోయే మబ్బు తునకల నుండి నూరుకాళ్ల గాజుల పురుగుదాకా ప్రతిదీ వింతగా కనిపిస్తాయి. తెలిసీతెలియని మిడిమిడి జ్ఞానంతో వాటిని గురించి గోరంతలు కొండంతలుగా చెప్పుకుంటారు. కావల్సిందల్లా వాళ్లకు ఒకరితో ఒకళ్లు మాట్లాడుకోవడం, మాత్లాడుతున్న విషయం ఏమిటన్నది కాదు.

ఈ లోకంలో చాలామంది "అదృష్టం" అంటే "ఐశ్వర్యం" అని అర్థం చెబుతారు. నా దృష్టిలో "అదృష్టం" అంటే "మనల్ని ప్రేమించే వ్యక్తి జీవితంలో తోడుగా దొరకటం!" ఆ తోడు కొండంత అండగా మనిషికి బలం ఇస్తుంది!. జీవితంలో ఎలాంటి మిట్టపల్లాలు ఎదురైనా, ఆ బలంతో సునాయాసంగా ఎదుర్కోవచ్చు! డబ్బును మనం సంపాదించుకోవచ్చు! కాని "ప్రేమను పంచి ఇచ్చేవ్యక్తి" దొరకటం అనేది కేవలం "అదృష్టం" మీద ఆధారపడి వుంటుంది.

ప్రేమంటే ఏమిటంటే.....!!! -1

నీకు పదిమందిలో కలిసే అవకాశం ఉండి, అందులో ప్రత్యేకంగా ఒక్కరే నచ్చితే అది ప్రేమ. ఆసమయంలో నువ్వు పూర్తిగా స్పృహలో ఉంటే అది ప్రేమ. మరోలా చెప్పాలంటే నువ్వు అవతలి మనిషిని కలుసుకున్న(కనీసం) మొదటి పదిసార్ల వరకూ ప్రేమలో పడకుండా ఉంటే అది ప్రేమ. అలా కలుసుకున్న పదిసార్లలో ఆ మనిషి పది సుగుణాల కన్నా, ఒక బలహీనత నువ్వు చెప్పగలిగితే, అలా చెప్పికూడా ఆ మనిషిని ఇష్టపడగలిగితే అది ప్రేమ.

అలా కాకుండా -----

ఒక వ్యక్తి నీమీద ఇంటరెస్ట్ చూపించగానే నీకు మత్తు కలిగితే అది ఆకర్షణ. ఆ వ్యక్తిని తప్ప మరెవరినీ తరచుగా కలుసుకొనే అవకాశమూ, మాట్లాడేవీలూ లేక దొరికిన ఆ ఒక్కరే గొప్పగా కనబడితే, ఆ ఇరుకు సందుల్లో స్నేహం చేయవలసివస్తే అది ఆకర్షణ. పరిచయం అయిన మొదటి రోజుకన్న సంవత్సరం తరువాత అవతలి మనిషి సాన్నిధ్యం తక్కువ ఆనందాన్నిస్తే అది ఆకర్షణ.

ఇతరులనుండి మనం పొందాలని అశించేప్రేమ, అభిమాన, అప్యాయతలన్నవి ముందు మనలో ఉండాలి. అవి మనలో లోపించినప్పుడు వాటిని ఇతరులనుండి పొందాలని అశించడం అత్యాశేకాదు అవివేకం కూడా. ఎందుకంటే ఇతరులతో మనకు గల పరిచయం అనే చిన్నమొక్కకు అభిమానం, ఆప్యాయత అనే 'నీటిని ' మనం పోస్తేనే అది మొగ్గతొడిగి "ప్రేమ" అనే 'పువ్వు 'నిస్తుంది. అందుకే మనం జీవించినంత కాలం మంచి మసున్న మనుషులా జీవిద్దాం. మరణించినను మంచితనపు సుగంధాన్ని ఎప్పుడూ పరిమళింప చేస్తుంది.

సృష్టికి మూలం ప్రేమ, ప్రతిసృష్టికి ప్రానం ప్రేమ. ఎందరో జీవితాలకు జీవం ప్రేమ, ఎన్నో కావ్యాలకు ఆధారం ప్రేమ. ప్రేమే లేకుంటే......సృష్టేలేదు. ప్రేమించే హృదయం...... ఆనందాల నిలయం. ద్వేషించే గుణముంటే అది విషాదాల నిలయం. ప్రేమే నిత్యం, ప్రేమే సత్యం, ప్రేమే ఈ జీవిత సర్వస్వం. ప్రేమించబడడం.....జీవితంలో ఓ గొప్ప అదృష్టం. కానీ అదే ప్రేమను, అదే అభిమానాన్ని, అదే ఆప్యాయతను, మీరు ఎదుటివారికి అందించకపోతే......ప్రేమించబడే అదృష్టం మీకు లభించదు.

ప్రేమంటే ఏమిటంటే.....!!!

హీర్ --------- రాంజా
సోనీ --------- మెహవాల్
షమ్మా --------- పర్వానా
రోమియో --------- జూలియట్
లైలా --------- మజ్ఞూ
సలీం --------- అనార్కలీ
దేవదాసు -------- పార్వతి
కులీకుతుబ్ షా -------- భాగమతి

---------- అమర ప్రేమ జంటలు.

మెరికా నుండి ంబాంబ్వే వారకు, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్న ప్రతి ఊర్లో ప్రేమలున్నాయి. కట్టుబాట్లున్నాయి. వాటిని ఎదిరించే ప్రేమికులున్నారు. ప్రపంచం లో దాదాపు ప్రతి ప్రేమికుడి నోట్లో నానే అమరజంటలతో పాటు తమ ప్రేమా చిరస్థాయిగా నిలచిపోవాలని ప్రతీ ప్రేమికులు కోరుకుంటారు. ఈ ప్రేమజంటలు ఉత్తిగానే చరిత్రలో నిలచిపోలేదు. ఇందులో కొన్ని కథలు ఉండవచ్చు, కొన్ని మాత్రం నిజమైనవే. నిజజీవితంలో పాత్రల పరంగా చేసిన త్యాగాలు, పోరాటాలే వారికి చరిత్ర కీర్తిని తెచ్చిపెట్టాయి.ఒక తెలుగు సినిమాలో "ఢిల్లి నుండి గల్లీ వరకు ఉన్నారండి గర్ల్ ఫ్రెండ్స్" అంటాడు. అది నిజమేనండి. ప్రతిచోట ప్రేమ ఉంది. ప్రేమకు ప్రాంతం, కులం,మతం, రంగు,భాషా ఏమి అడ్డురావు. ఎవరు ఎక్కడ,ఎప్పుడు,ఎందుకు కలుసుకుంటారో, వారిమధ్య ప్రేమ ఎలా పుడుతుందో ఎవరుచెప్పగలరండి. లేకుంటే ఇటలీ లో పుట్టిన సోనియాకు , ఇండియాలో పుట్టిన రాజీవ్ గాంధికి, ఇంగ్లాండులో ప్రేమ పుట్ట్టడం ఏంటీ?. వారు చక్కగా ప్రేమించుకున్నారు. అందరిని ఎదిరించి పెళ్ళి చేసుకున్నారు. ఆ ధైర్యం వాళ్ళది కాదు, ప్రేమ నుంచి వచ్చిందే. అందుకే ప్రేమ ప్రాంతీయ, వర్ణభేదాలకు అతీతమైనది. శతాబ్దాల తరబడి ప్రేమలు ఉన్నప్పటికీ ప్రతి ప్రేమికులు తమ ప్రేమ ఇతరుల కంటే విభిన్నమైనదని భావిస్తారు. ఇక ఎంతవరకు నిజమో తెలియదు కానీ, ప్రతి ఒక్కరు తమ జీవితకాలం లో ఒక్కసారైనా ప్రేమలో పడతారట[ అన్ని ప్రేమలు ఫలించకపోవచ్చు కాని తాత్కాలికంగానే ఆభావానికి గురవుతారు]. వాళ్ళు ప్రేమలో పడలేదంటే అబద్దమైనా చెబుతుండాలి లేక వారిలో స్పందించే హృదయమైనా లేకుండా ఉండాలని ఓ మాజీ ప్రేమికుడు బల్లగుద్ది చెప్పాడు. ఇందులో నిజమెంతో ఆ దేవుడికే తెలియాలి.

Sunday, March 2, 2008

మనుషుల స్వభావాలు -6

చాలా మంది "పిల్లలు" అనగానే నారక్తం కదా అనుకుంటారు. నేను శాసించినట్టే మెలగాలి, ఆ అధికారం నాకుందీ అనుకుంటారు. అందులో తల్లిలో ఈ భావన అత్యధికం. వీళ్ళు నా సొత్తు అని భావిస్తారు. ఆ భావనతోనే వాళ్ళు స్వార్థం అనేది లేకుండా పిల్లల్ని చూడగలుగుతారు. కాని పిల్లలంటే ఎవరు? - వ్యక్తులు. ఏ పువ్వూ జన్మనిచ్చిన చెట్టులా వుండదు కదా!. పువ్వు పూసేటంత వరకు, దానికి శక్తి ఇవ్వడం వరకే చెట్టూ యొక్క కర్తవ్యం. పువ్వు అనేదాని సృష్టికోసం చెట్టు తన బలాన్ని ఇస్తోంది. ఆ బంధం అంతవరకే పరిమితం. పిల్లలు కూడా అంతే -- మా రక్తం పంచుకుని పుట్టావు, మేం పెంచాం, నువ్వు మాలాగానే ఉండు అంటే ఏ బిడ్డా వుండదు. సృష్టి ధేయం అది కానే కాదు. ఒక మనిషిలా ఆ మనిషికి పుట్టిన బిడ్డే వుంటే మనిషి జీవితం ఇంత విభిన్నంగా, విస్తృతంగా ఏనాటికే అయ్యెది కాదు. అప్పుడు ఈ మనవ సృష్టి కార్బను కాపీలా వుండేది.

ఏ మనిషికైనా స్ర్తీ గానీ, పురుషుడుగానీ, తల్లి కేంద్రబిందువుగా ఆ మనిషి జీవితం ప్రారంభం అవుతుంది! అందుకే ఏ కుటుంబంలోనైనా తండ్రి సరిగ్గా లేకపోయినా, తల్లి పద్దతిగా వుంటే ఆ పిల్లలు సరైన నడవడిలో పైకి వస్తారు. పిల్లల జీవితాల్లో వాళ్ళకి తెలియకుండానే తల్లి ఆకర్షణ అమితంగా వుంటుంది! ఆవిడ నడవడి, జీవన విధానం, జీవితం పట్ల దృక్పధం ఆ లేతమనస్సులు తమకి తెలియకుండానే అందిపుచ్చుకుంటాయి! తల్లి వున్న ఏ బిడ్డ అయినా ఒంటరితనంతో కృంగిపోతోందీ అంటే ఆతల్లి క్షమించరాని నేరం చేస్తోందీ అన్నమాటే! "క్షమించరాని నేరం" అని ఎందుకు అంటున్నాను అంటే, ఆబిడ్డ పెద్దయిన తర్వాత, తన విపరీతమైన ప్రవర్తన ద్వారా ఇటు ఇంట్లోవారికి, అటు బైట సంఘానికి తలనొప్పిగా తయారవుతుంది.

మనుషుల స్వభావాలు -- 5

"గచ్ఛతః స్ఖలనం క్వాపి" అని సంస్కౄతంలో ఓ సామెత. నడుస్తున్న వాడు ఎప్పుడైనా జారిపడవచ్చునని దీని అర్థం. అలా జారి పడ్డవాడికి జారిపడతాననే కొత్త భయం కారణం గా జాగ్రత్తగా నడవ్వాలనే కొత్త అనుభవం మనసుకొస్తుంది. అది మంచి పరిణామమే. అలాగే పిల్లవాడేదైనా తప్పు చేస్తే వెంటనే దండించడం మంచిదే. ఎక్కడ వాడిని దండిస్తే చులకన అయిపోతామో అనిగాని, మనపిల్లవాడు తప్పు చేసినప్పటికీ, ఆ విషయం బహిరంగమై మనపిల్లవాడి ప్రవర్తన ఎలా అయిపోతుందో అనే అనవసర ఆలోచనతో గానీ, మరి ఏ ఇతర కారణం వల్ల గానీ, వాడు చేసిన తప్పుకి సరిపడ్డ మందలింపుకానీ, దండనకానీ, లేని పక్షంలో మనచేపపు చేతల్లో లేకుండా వాడు ఏకుకి మేకై కూచుంటాడు.

భారతం లో -- శిశుపాలుని తల్లి సాత్వతి శ్రీకౄష్ణుణ్ణి ఓ చిత్రమైన వరం కోరింది. కౄష్ణా! మా అబ్బాయి నూరు తప్పులు చేసేంత వరకూ వాణ్ణి చంపకు! అని. కౄష్ణుడు సరే! అన్నాడు. నూరు తప్పులు చేయడానికి అలవాటు పడ్డవాడు నూట ఒకటవ తప్పుని ఎలాగు చేయకుండా ఉండలేడు. కాబట్టి అప్పుడతన్ని చపెయ్యవచ్చు అనేది కౄష్ణుని ఆలోచన. ఆ పుత్రుని మీద ఉండే ప్రేమ సాత్వతికి ఈ దూరపు ఆలోచన చేయనియ్యలేదు. కాబట్టి తప్పు చేసిన వెంటనే దండించని తల్లి తప్పుకి బలైన వాడు శిశుపాలుడు. ఈతప్పు పెంపకానిదే తప్ప పిల్లవాడిదా?. కాబట్టి తప్పుచేస్తే వెంటనే మందలించాల్సిందే తప్ప వెనకేసుకుని రాకూడదు.

శ్రీమద్రామాయనంలో -- విశ్వామిత్రుడి మీదకు మారిచుడు దూకాడు. కోపంతో, ఆయన "రాక్షసుడివి అయిపో" అని శపించాడు మారీచుణ్ణి. తన అందంగా ఉండే యక్షరూపం పోయి రాక్షసరూపం రాగానే దుఖఃపడ్డ మారీచుడు, తనతల్లి తాటక వద్దకెళ్ళాడు. అసలు ఏం చెసావని కూడా అ తల్లి అడగలేదు. "ఎవడ్రా ద్రోహి?, దుర్మార్గుడు"అంటూ బయల్దేరి విశ్వామిత్రుని మీదకు వెడుతూ తన పుత్రుని స్నెహితుడైన సుబాహుణ్ణి కూడా వెంటేసుకొని జగడానికి వెళ్ళింది. తానుచచ్చింది, తనపుత్రుని స్నేహితుణ్ణీ చచ్చేలా చేసింది. తనపుత్రుణ్ణి తన ఎదురుగానే రామబాణానికి గాయపడేలా చేసింది. ఇదంతా అసలు ఏం జరిగిందో తెలుసుకోక పోవడం వల్ల కదా వచ్చింది. కాబట్టి వెనుకేసుకు రావద్దు పిల్లల్ల్ని.

"తనకి చదువు చెప్పి పెద్ద చేసిన గురువులనీ, తల్లిదండ్రుల్ల్నీ ప్రత్యక్షంగా ప్రశంసించవచ్చట. తనకి సహయం చేసిన మిత్రుల్నీ, బంధువుల్నీ వారి పరోక్షంలో పొగడాలట. ఇక పనిని బాగా చేసుకొచ్చాక తన దగ్గర జీతాన్ని తేసుకొని పనిచేసే భృత్యుణ్ణీ, నిస్వార్థంగా పని చేసే దాసుడుంటే అతణ్ణీ మెచ్చుకోవాలట. ఇక సమ్ముఖంలో గాని, పరోక్షంగా గాని, పనికి ముందు గానీ, పనైపోయాకగానీ ఎప్పుడు పొగడరానిది పిల్లలనేనట".

Saturday, March 1, 2008

మనుషుల స్వభావాలు-4

ఏ మనిషికైనా తన గురించి తను ఆలోచించుకోవడంలో తప్పు లేదు. భవిష్యత్తును కూడా గొప్పగా ఊహించుకోవడంలోనూ తప్పులేదు. దానికోసం ఒకింత స్వార్థం గా ప్రవర్థించడం లోనూ తప్పు లేదు. నేను మాత్రమే నాకు కావలసిన వాటినివాటిని, వారిని సొంతం చేసుకొని జీవితాంతం సుఖపదాలని అనుకోవడంలోనే మనిషి మనిషనే అర్హతను కోల్పోతాడు.

తమని తాము తెలివిగల వారిగా చిత్రీకరించుకోవడంలో తప్పులేదు. అవతలవారిని మాత్రం మరీ తెలివితక్కువ వాళ్ళుగా చూడతమే తెలివితక్కువ తనం. సలహాలిస్తూ, సహాయం చేసేవారికి స్నేహితులు పెరుగుతారు....చివరిదాకా మిగులుతారు. కేవలం సలహాలే ఇస్తూ, తప్పులు పట్టేవారికి ఎవరూ ఎప్పటికీ మిగలరు.

మీగురించి ఇతరులేమనుకుంటున్నారన్న దానికంటే మీగురించి మీరేమనుకుంటున్నారనేది మరీ ముఖ్యం. మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడమే ఆత్మగౌరవం. ఎలంటి పరిస్థితులు ఈమిటన్నది తర్వాత సంగతి. కాని అన్నింటికంటే నిజాయితి అనేది ఉత్తమోత్తమ పాలసీ. అయితే నిజాయితీగా లేకపోతే అనిజాయితీగా వుండాలి, అంతే దీనికి మధ్యేమార్గం లేదు.

మనసుకి కళ్ళు అద్దాలాంటివి. మనసులో వున్నభావాలు కళ్ళలో కనబడిపోతూ వుంటాయి. సాధారణంగా ఒక్కొక్క మనిషిది ఒక్కొక్క స్వభావం-ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క మూడ్, స్వభావాన్ని బట్టి, మూడ్ని బట్టీ కళ్ళలో భావాలు వేరువేరుగా కనబడుతూ వుంటాయి.మనం పెరిగిన వాతావరణాన్ని బట్టీ, వున్న హోదాని బట్టి మొహంలో భావాలు మారుతూ ఉంటాయి.


మనిషి ముఖం అద్దంలాంటిది. ఒక మనిషి ముఖం ద్వారా ఆ మనిషి బాహ్య వ్యక్తిత్యం, అంతర్గత వ్యక్తిత్యం, కోపతాపాలు, కోరికలు, బలహీనతలు, ప్రవర్తన తెలుసుకోవచ్చు. మానవప్రపంచంలో కొన్ని కోట్ల ముఖాకౄతులు కనిపిస్తాయి. ఒక్కొక్క ముఖం ఒక్కొరకం గా ఉంటుంది.

మనుషుల స్వభావాలు-3

వ్యక్తులందరూ ఒకేతీరులో ఉండరు. కొందరు గుంభనంగా ఉంతారు. వారినుండి అభిప్రాయాల్ని బయతకు రప్పించేందుకు ఎక్కువ కాలమవసరం అవుతుంది. మరికొందరు ఇట్టే బయటపడతారు. అడిగే నాదుడు లేక అడుగంటిపోయిన అభిప్రాయాలన్ని ఒక్కసారిగా పెల్లుబుకుతాయి. ఇంకొందరు అవగహన లోపం వలన సమాచారం అందకపోవదం వల్ల తప్పుడు అంచనాలతో, అభిప్రాయాలతో నిరాశానిస్పౄహల మధ్య కొట్టుమిట్టాడుతూ బతుకుతెరువు కోసం పనిచేయక తప్పదనే భావంతో ఉంటారు. వారినుండి పనులు సాధించాల్సి వచ్చినప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తి స్వాభిమానాన్ని ప్రక్కన పెట్టినప్పుడే విజయం సాధించగలరు.

కొంతమంది సమక్షం వెన్నెలల చల్లగా వుంటుంది. ఎన్ని బాధలున్నా నిమిషంలో అవన్ని మననుంచి దూరంకాగా, సేదతీరిపోతాం! మరికొంతమంది సమక్షం అలావుండదు. ముళ్ళమీద కూర్చున్నట్లు యిబ్బందిగా, అశాంతిగా వుంటుంది. నిశ్చింతగా వున్న మనసుకూడా అశాంతిపాలు అవుతుంది.

మందు, విందు, మగువ, జూదం, వ్యసనం, స్వార్థం, కుచ్చితం, అసూయ, అహంభావం, క్రోధం, కోపం, అసహనం, అలసత్వం, బద్దకం,అతిసుఖం, అతినిద్ర, భొగలాలస, అధికారదాహం, ఆర్భాటం, అయోమయం,అన్యాయం, అక్రమం, లంచగొండితనం, నిర్దయ, నిర్లక్ష్యం, నిరంకుశత్వం, నేను-నాది-నావాళ్ళు, రౌడీయిజం --- ఎన్ని మానసిక వ్యాధులు....? నిత్యం మనిషి వీటిమధ్యలోంచే ప్రయాణిస్తుంటాడు. తనెంతకాలం బతుకుతాడో తనకే తెలియదు....? తనెంతకాలమైనా బతకగలను అనే ఆశతో అనుక్షణం వీటన్నింటికి లోనయిపోతూ, అరుదుగా లభించే మానవజన్మను నికౄష్టాలమయం గా మార్చుకుంటాడు. మనిషి తనని తానే చెడగొట్టుకుంటాడు తప్ప-తనను చెడగొట్టే అవకాశాన్ని, హక్కుని మరెవరికీ అందివ్వడు.

Friday, February 22, 2008

మనుషుల స్వభావాలు-2

కొందరు తప్పనిసరి పరిస్థితులలో దిగులుపడతం సహజం. కొందరికి నుదుట బొట్టులా దిగులుంటుంది. ఎప్పుడూ దైన్యంగా కనబడుతున్నట్లు ఉంటారు. వాస్తవానికి వీళ్ళకు దిగులు ఉండదు, దిగులుకే వీళ్ళుంటారు. వారి ముఖం తీరు, ప్రవర్తన తీరు అలాగే వుంటాయి. ఇలాంటి వాళ్ళతో ఐదు నిమిషాలు మాట్లాడితే మనక్కూడా "దిగులు జబ్బు" అంతుకుంటుందనిపిస్తుంది.

తన వీధిలోకి వచ్చిన మరో బలవంతుడ్ని ఆ వీధి గూండా అంగీకరించలేడు. తనకన్నా ఎఫిషియెంటైన పోలీసాఫీసర్ని అతడి బాసే సహించలేడు. అంతెందుకు.....తన పరిధిలో ఆనందంగా బ్రతికే పులి సైతం అక్కడికో కొత్త పులి వస్తే తరిమేయాలనుకుంటుంది. ఉన్నవాడు లేనివాడిని దోచుకొనేది అతడు ఎప్పటికీ లేనివాడుగా మిగలాలనే తప్ప అతడిమీద అంతకు మించి కక్ష వుండదు.

లోకులు ఎదుటివారిలోని ఔన్యత్యాన్ని త్వరగా గుర్తించరు. కాని బలహీనతల్ని మాత్రం వెంటనే భుతద్దం లోంచి చూసి కావుకావుమనే అరుస్తారు. వారికదో ఆనందం. దాని వెనుక ఆత్మవంచన ఉందని వారికి తెలుసు. అయినా ఎదుటివారిని కించపరిస్తే తామేదో గొప్పవారైపోతారన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏనుగు వెళ్తూంటే కుక్కలు మొరగవా? అలా.

మరుసటి టపా లో ప్రేమ గురించి....అంతవరకు సెలవు.

Thursday, February 21, 2008

మనుషుల స్వభావాలు-1

ఇంకోకావిడా పూర్తిగా శాఖాహారులైన తన కోడలి పుట్టింటికి మాంసాహారుడైన తన కొడుకు ను పంపదట. వెళ్లాలనుకుంటే కోడలు ఒంటరిగా వెళ్ళవచ్చట. ఎందుకంటే తన కొడుకుకి మాంసం వండి పెట్టారని. పండుగ రోజు తనే తృప్తిగా వండి పెడుతుందట. ఏం? రొజూ తన కొడుకుకి మాంసం వండి తృప్తి గా పెట్టవచ్చు కదా!! పండుగ రోజే పట్టాలా??. కోడలు తరపువారు మాంసం తినరు అని తెలిసి ఎందుకు తెచ్చుకున్నట్లు వారిచ్చే కట్నం కోసం కాకపొతే??

ఈవిడే ప్రతి శుక్రవారం గుడికి వెళ్తుంది. ఆరోజు ఆమె చేసే హడవిడి అంతాఇంతా కాదు. ఇంట్లో కుక్క పిల్ల మొదలుకొని ప్రతి ఒక్కటి శుభ్రంగా వుండలి. మిగతా రోజులలో ఈగలు ముసురుతున్నా పట్టించుకోదు. ఒక్కరోజు గుడికి వెళ్ళడానికే ఇంత నిష్ఠ పాటించే ఆమె, చిన్నప్పటినుండి మాంసం అలవాటు లేని తన కోడలు మాత్రం వారు వండి పడేసిన పాత్రలలోనే వండుకు తినాలి. ఎంత దారుణం!, ఎంత స్వార్థం!.

ఇంకొకావిడ తన పక్కింటి పంకజం తో చెబుతోంది..." మా అల్లుడు బంగారు కొండ, మా అమ్మాయి ఎలా చెబితే అలా నడుచుకుంటాడు, ఏది పెడితే అది తింటాడు, తనని చాలా బాగా చుసుకుంటాడు, పెత్తానం అంతా మా అమ్మాయిదే!!, నా కొడుకును చూస్తేనే బాధేస్తుంది. నా కోడలు ఆడించినట్లు ఆడుతాడు, ఆ రాక్షసి వాడిని కొంగుకు ముడేసుకుంది" అని. ఆహా!! కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా??

ఇంకొకామె తన కోడలు తనను ఎంత బాగా చూసుకున్నా, చక్కగా సంసారం చేసుకున్నా ఎదురింటి, పక్కింటి వారి కోడల్లతో పోల్చి లోపాలను ఎత్తి చూపందే తిన్నది జీర్ణం కాదు. మరి అలాంటప్పుడు వారి లాంటి వారినే(వారినే) కొడలుగా తెచ్చుకొని వుండవచ్చు కదా?.

పాపం కొత్త కోడల్లు! తను ఇప్పటి వరకు ఉన్న వాతావరణం నుండి వాతావరణం లోకి వచ్చి వారిథో సర్దుకొని తన జీవనయానాన్ని సాగించే ఎందరో నారిమనులు, అందరికి జోహారులు.

మరికొన్ని మరుసటి టపాలో..........

Monday, February 18, 2008

మనుషుల స్వభావాలు

మనకు నిత్య జీవితం లో రకరకాల మనస్తత్వాలు కల రకరకాల మనుషులు ఎదురవుతువుంటారు. అంతెందుకు మనలోనే మనం సంధర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తిస్తాం. కొన్ని సమయాలలో మంచిగా ప్రవర్తిస్తాం, మరి కొన్ని సమయాలలో మంచిగా ప్రవర్తిస్తున్నట్లు నటిస్తాం. ఇంకొన్ని సమయాలలో ఇంకో విధంగా ప్రవర్తిస్తాం.

నాకు తెలిసిన ఒకావిడ మనలను బాధ పెట్టె విషయం చెప్పాలనుకున్నప్పుడు "ఏమి అనుకోకండి" అని మొదలు పెడుతుంది. ఏమైనా అనుకొనే విషయమైతే చెప్పడమెందుకు, ఆ విషయం విన్న తరువాత మనం ఏమి అనుకోకుండా ఎలా వుండగలం?? మీరు ఏమైనా అనుకోండి నేను చెప్పాలనుకున్నది చెప్పాను అన్నట్లు ఆమె వుద్దేశమేమో అనిపిస్తుంది.

ఈవిడే తన కోడలు తో అనాల్సిన మాటలు అన్నీ అనేసి "మళ్ళీ ఎవరితో అనకమ్మా, వాడితో(కొడుకు)కూడ అనకు" అంటుంది. కొడుకు కోడలు మధ్య అగాధం పెంచి, తనకోడలు ఆమె అన్న మాటలు జీర్ణించుకోలేక, తన భర్తతొ పంచుకోలేక బాధ పడుతుంటే చూసి ఆనందించడం ఈమె వంతు.
ఇంకొకావిడ తన కోడలు తరపు వారి తో "మా అమ్మాయికి అవి పెట్టాం, ఇవి పెట్టాం" అని గొప్పగా చెపుతుంది. మీ అమ్మాయి కీ మీరు అలా లేక అంతకన్నా ఎక్కువ గా పెట్టండని ఆమె చెప్పకనే చెపుతుంది. పాపం వారు ఇచ్చుకొనే స్థితిలో వుంటే సరే!! లేదంటే వారి??. పరిస్థితి?? ఐనా ఆమె ఎందుకంత గొప్పగా చెప్పుకుంటుందో అర్థం కాదు, ఆ పెట్టడం పెట్టింది వేరే ఎవరికో కాదుగా, తన సొంత కూతురికే గా, మరి గొప్పగా చెప్పుకోవడం దేనికి.

సశేషం........

Saturday, February 16, 2008

అందరికి నమస్కారం!!,

యురేకా....యురేకా......యురేకా
ఇది నా తొలి టపా. నాకు ఎలా బ్లాగా లో తెలిసి పొయిందోచ్చ్!!

మళ్ళీ నా వచ్చే టపా లో కలుద్దాం.. అంత వరకు సెలవు.