Wednesday, March 26, 2014

శ్రీనాధుని చమత్కారం

శ్రీనాధుని చమత్కారం


సీ:
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                                          తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                                            తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజులు సాటి
                                            తలప నల్లయ వేమ ధరణి పతికి
రాజనందన రాజ రాజాత్మజుల సాటి
                                             తలప నల్లయ వేమ ధరణి పతికి


గీ:
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను
భావభవ భోగ సత్కళా భావములను


ఈ పద్యానికి దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఈ విధం గా అర్థం చెప్పారు.

సీస పద్యంలో మొదటి చరణం, గీతపద్యంలో మొదటి చరణం తో క్రమంగా అన్వయించుకోవాలి. అల్లగే, రెండవ చరణం, రెండవదానితో, మూడవ చరణం మూడవదానితో, సీసపద్యం ఆఖరి చరణం గీతపద్యం ఆఖరి చరణం తో, వరసగా అన్వయించుకోవాలి.

మొదటి చరణద్వయాల అర్థం, అన్వయం:

రాజ నందన = చంద్రుని కొడుకైన బుధుడు,
ర = సమర్థుడైన, అజ= ఈశ్వరుడు
రాజ = దేవేంద్రుడు
ఆత్మజులు = బ్రహ్మదేవుడును

తలపన్ = ఆలోచించగా
అల్లయ వేమ ధరణిపతికి = అల్లయ వేమారెడ్డి అనే రాజుకు
సాటి = సమానులు

భావ = బుద్ధియందు
భవ = ఐశ్వర్యమునందును
భోగ = వైభవంలోనూ
సత్కళా = శ్రేష్టమైన విద్యలయొక్క
భావములను = అతిశయమందును

బుద్ధియందు, ఐశ్వర్యమందు, వైభవంలోను, శ్రేష్టమైన విద్యల యొక్క అతిశయములందూ, చంద్రుని కుమారుడైన బుధుడు, సమర్థుడైన ఈశ్వరుడు, దేవేంద్రుడు, బ్రహ్మదేవుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

రెండవ చరణద్వయాల అర్థం, అన్వయం:

ర + అజ + నందన = మనోహరుడైన శివునికి కుమారుడైన కుమారస్వామి
రాజ = కుబేరుడు
ర + అజ = శ్రేష్ఠుడైన , రఘువు కుమారుడైన యజుడు
ఆత్మజులు = చంద్రుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.

భావ = క్రియ యందు
భవ = ధనమునందు
భోగ = పరిపాలనలో
సత్కళా = శ్రేష్ఠమైన కాంతి యొక్క
భావములను = సమూహమునందును

క్రియయందు, ధనమునందు, పరిపాలనలో శ్రేష్ఠమైన కాంతి సమూహమునందును, మనోహరుడైన శివుని కుమారుడైన కుమార స్వామి , కుబేరుడు, శ్రేష్ఠుడైన రఘువుకు కొడుకైన అజుడు, చంద్రుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

మూడవ చరణద్వయాల అర్థం, అన్వయం:

ర + అజ + నందన = బంగారం వంటి కాంతిగల బ్రహ్మకు పుట్టిన సనత్కుమారుడు
ర + అజ = శ్రేష్ఠుడైన బ్రహ్మకు పుట్టిన వశిష్ఠుడు
రాజ = క్షత్రియుడైన
ఆత్మ + జ = బృహస్పతియందు పుట్టిన కచుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు.

భావ = ఆత్మ జ్ఞానమునందు
భవ = పుట్టుకయందు
భోగ = అనుభవమునందు
సత్కళా = అభివృద్ధియొక్క
భావములను = పద్ధతులందును

ఆత్మ జ్ఞానమునందు, పుట్టుకయందు, అనుభవమునందు, అభివృద్ధియొక్క పద్ధతులందును బంగారువంటి కాంతి కలిగిన బ్రహ్మకు కుమారుడైన సనత్కుమారుడు, శ్రేష్ఠుడైన బ్రహ్మకుపుట్టిన వశిష్ఠుడు, క్షత్రియుడై బృహస్పతి వలన పుట్టిన కచుడునూ, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

నాలగవ చరణద్వయాల అర్థం, అన్వయం :

ర + అజ + నందన = శ్రేష్ఠుడైన మన్మధుని కుమారుడైన అనిరుద్ధుడును
ర + అజ = సర్వ వ్యాపకుడైన విష్ణువు
రాజ = యక్షుడును (నలకూబరుడు ?)
ఆత్మజ = మన్మధుడును

తలప అల్లయ వేమ ధరణిపతికి సాటి = ఆలోచించగా అల్లయ వేమా రెడ్డి అనే రాజుకు సమానులు ( అన్ని పాదాలకీ ఒకే అర్థం)

భావ = ఆకారమునందును
భవ = సంసారమందును
భోగ = సుఖానుభవమునందును
సత్కళా = సౌందర్యము యొక్క
భావములను = రీతియందును

ఆకారమునందు, సంసారమందు, సుఖానుభవమునందు, సౌందర్యముయొక్క రీతియందును, శ్రేస్ఠుడైన మన్మధునికుమారుడైన అనిరుద్ధునికి, సర్వ వ్యాపకుడైన విష్ణువు, యక్షుడైన నలకూబరుడు, మన్మధుడును, ఆలోచించగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు.

గీత పద్య పాదానికి, సీసపద్యపాదానికీ మధ్య ఉన్న క్రమాలంకారం గమనించదగ్గది.

ఉదాహరణకి, మొదటి చరణాలద్వయం తీసుకోండి.

బుద్ధియందు చంద్రుని కుమారుడైన బుధుడు, ఐశ్వర్యమునందు సమర్థుడైన ఈశ్వరుడు, వైభవములో దేవేంద్రుడు, మంచివిద్యలయొక్క అతిశయములందు బ్రహ్మదేవుడును, ఆలోచింపగా అల్లయ వేమారెడ్డి అనే రాజుకు సమానులు. మిగిలిన వాక్యాలూ ఇల్లాగే క్రమాన్వితం చేసుకోవాలి.

Tuesday, March 25, 2014

శ్రీనాథుని భీమఖండ పద్యం

చంద్రబింబాననచంద్రరేఖామౌళి నీలకుంతలభారనీలగళుఁడు 
ధవళాయతేక్షణధవళాఖిలాంగుండు మదనసంజీవనిమదనహరుఁడు
నాగేంద్రనిభయాననాగకుండలధారి భువనమోహనగాత్ర భువనకర్త
గిరిరాజకన్యకగిరిరాజనిలయుండు సర్వాంగసుందరిసర్వగురుఁడు

గౌరిశ్రీ విశ్వనాథుండు కనకరత్న 
పాదుకలు మెట్టిచట్టలు పట్టుకొనుచు 
నందికేశుండు ముందట నడచిరాఁగ 
నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.
. పై సీసపద్యములోనినాలుగు పాదాల్లోనూ పార్వతినిపరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు!
  • గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము).మరిశంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
  • ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో నీల' అనే పదానికి నలుపు ' అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా!
  • ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు.
  • మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు.
  • ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (నాగము ' అంటే ఏనుగు అనే అర్థం వుంది.)స్త్రీలను గజగమనలు ' అని వర్ణించడం కవులకు పరిపాటే! మరిశివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు.
  • సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
  • ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
  • అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువు;జగద్గురువు.
        పైవిధంగా ఆ ఆదిదంపతులుతమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు.

        మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలాశ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం. 

అపూర్వ ద్వర్థి

                                    అపూర్వ ద్వర్థి 
   

శ్రీ ప్రభాకరాన్వయప్రాతరారాధ్యుఁ
డుత్తముండు వెలయు నుదితయశుఁడు
భువి నయోధ్య నాగపురికి నధీశుండు
దాశరథి యనంగ ధర్మరాజు.

దాశరథి శ్రీరామచంద్రునికిధర్మరాజు యుధిష్ఠిరునికి ఉభయాన్వయం ఇది.

శ్రీరామచంద్రుని పరంగా అర్థం:

భువిన్ = పుడమి యందు
అయోధ్య నాఁగన్ = అయోధ్య అను పేరుఁగల
పురికిన్ = పట్టణమునకు
అధీశుండు = అధిపతి యగు
శ్రీ = సర్వసంపత్కరమైన
ప్రభాకర+అన్వయ = సూర్యవంశమునందు (ప్రభాకరః = రవౌ),
ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతఃకాలమున ఆరాధింపఁదగిన స్వామి
ఉత్తముండు = శ్రీ మహావిష్ణుస్వరూపుఁడు;
ఉదితయశుఁడు = విశ్రుతమైన కీర్తి గలవాఁడు (యశః = విశ్రుతత్వే)
దాశరథి = దశరథాత్మజుఁ డైన శ్రీరామచంద్రుఁడు
అనంగన్ = అనఁగా
ధర్మరాజు = ధర్మస్వరూపుఁ డగు ప్రభువు
వెలయున్ = ఒప్పారును.

ధర్మరాజు పరంగా అర్థం:

భువిన్ = భూమి యందు
అయోధ్య నాఁగన్ = శత్రుయోధులకు గెలువ శక్యము గానిది యగు
నాగపురికిన్ = హస్తినాపురమను పేరుఁగల పట్టణమునకు
అధీశుండు = అధిపతి యగు
శ్రీ = సర్వసంపత్కరమైన
ప్రభాకర+అన్వయ = చంద్రవంశమునందు (ప్రభాకరః = చంద్రే)
ప్రాతః + ఆరాధ్యుఁడు = ప్రాతర్వంద్యుఁడు
ఉత్తముండు = సర్వశ్రేష్ఠుఁడు
ఉదితయశుఁడు = ప్రసిద్ధికెక్కినవాఁడు
దాశరథి = తనను నిత్యము సేవించు వీరుల మహాసైన్యముఁ గలవాఁడు 
(రథ = పౌరుషవంతులైన
దాశ = సేవక గణము - "రథః స్యన్దనే శరీరే పౌరుషే యోద్ధరి" అని శబ్దార్థకల్పతరువు)
అనంగన్ = అనఁగా
ధర్మరాజు = ధర్మరాజు అను పేరుఁగల యుధిష్ఠిరుఁడు
వెలయున్ = ఒప్పారును.

                                                                              -   ఏల్చూరి మురళీధరరావు గారు

ఉత్తరోత్తరావరోహణ పూర్వక చతుర్వింశత్యక్షర సోపాన సంక్షేప రామాయణ దండకము

త్రిశత్యక్షర సంక్షేప రామాయణము



సోపాన దండకము



రామ!
భూమీశ!
కౌసల్యజా!
సద్గుణస్తోమ!
కారుణ్యవారాశి!
ధర్మప్రభాభాసురా!
తాటక ప్రాణసంహార!
గాధేయ యజ్ఞావనోత్సాహ!
మౌనీంద్ర సంస్తుత్య వీర్యోన్నతా!
ధారుణీనందినీ మానసారామ!
దేవేంద్ర ముఖ్యామర స్తుత్య చారిత్ర!
కళ్యాణ శోభాన్వితానంద రూపోజ్వలా!
పైతృకాజ్ఞా ప్రకారాంచిత త్యక్తసామ్రాజ్య!
సోర్వీసుతా లక్ష్మణారణ్య సంవాస సంప్రీత!
ఘోరాటవీప్రాంత వాసర్షి బృందావనానందితా!
క్రూర దైత్యాంగనా దుష్ట కామార్తి విధ్వంసనోత్సాహ!
మాయామృగాకార మారీచ ఘోరాసుర ప్రాణసంహార!
ధాత్రీతనూజా వియోగాతి దుఃఖాగ్ని సంతప్త హృన్మందిరా!
అంజనాపుత్ర సంశుద్ధ వాగ్భూషాణానీక సంశోభితాత్మాబ్జ!
వాతాత్మసంజాత రంహత్సమానీత భూమీసుతా క్షేమ సందేశ!
సంగ్రామ రంగస్థ లంకాధినాథాది ఘోరాసురానీక సంహారకా!
దేవతానీక దిక్పాల గంధర్వ యక్షోరగవ్రాత సంస్తుత్య సత్కీర్తి!
విశ్వసర్గాది నాశాంతలీలా వినోదాభిరామా! నమస్తే నమస్తే నమః 


                                                                                                                - పండిత నేమాని రామజోగి సన్యాసి రావు

సంయుక్తాక్షర కందము

సంయుక్తాక్షర కందము  
త్యత్‌క్ష్మాభృద్ద్విట్స్తోత్రా
త్మ్యత్‌క్ష్మాభృద్ద్విడ్జహృత్క! ద్యౌత్రాస్థాన్యో
ద్యత్‌క్ష్మాశ్రీస్ఫూర్జన్నే
త్రోత్‌క్ష్మేన్ద్రాభ్యర్చ్యకృత్య! ద్యుమ్నస్తుత్యా!

ప్రతిపదార్థములు -

త్యత్ = ప్రసిద్ధిని పొందుచున్న, 
క్ష్మాభృత్ = పర్వతములకు
ద్విట్ = శత్రువైన ఇంద్రునియొక్క
స్తోత్రా = పొగడిక గలవాఁడా! 
(ఉపేంద్రుఁడ వయ్యు ప్రసిద్ధమైన ఇంద్రసూక్తముచే దేవేంద్రుని స్తోత్రముల నందుచున్న దేవా!)
ఆత్మ్యత్ = ఆత్మసాత్కృతుఁ డగుచున్న 
క్ష్మాభృత్+ద్విట్+జ = దేవేంద్రుని వరప్రసాదమున జన్మించిన అర్జునునిహృత్క = డెందమున నిలిచిన స్వామీ!
ద్యౌత్ర = జ్యోతిర్ద్రవ్యములకు
ఆస్థానీ = కొలువైన ప్రభూ
అ = శ్రీ వాసుదేవా!
ఉద్యత్ = వెలుఁగొందుచున్న 
క్ష్మా = భూదేవియొక్క
శ్రీ = శ్రీదేవియొక్క ఉనికిచేత
స్ఫూర్జత్ = ప్రకాశమానములైన
నేత్రా = కన్నుల కాంతులు గలవాఁడా!
ఉత్ = మహనీయులైన (లేదా) మోక్షార్థులైన
క్ష్మా+ఇన్ద్ర = పృథు ప్రియవ్రత ప్రహ్లాద గయాది రాజేంద్రులచే
అభ్యర్చ్య = పూజింపఁదగిన
కృత్య = అవతారకార్యములు గలవాఁడా!
ద్యుమ్న = సమగ్రైశ్వర్య వీర్య యశః శ్రీ జ్ఞాన వైరాగ్య సృష్టిస్థితిసంహారాది మహాశక్తిసంపన్నతచే
స్తుత్యా = స్తోత్రపాత్రుఁడ వైన స్వామీ!  

ఏకాక్షరి

                                       ఏకాక్షరి


డండడ డేడిడ డైడా
డండా డోడౌడ డాడడాడా డాడై
డండూడిడౌడడడడా
డండడడడ డండడండ డం! డడ!! డండమ్!!!


అర్థాలు -
డం = డమరుకము యొక్క,
డ = శివంకరమైన నాదమునందు;
డ = ప్రీతి గొన్న స్వామీ! పరమేశ్వరా!
డే = దాంపత్యధర్మమును అనుసరించి,
డి = గౌరీదేవిని,
డ = మేని సగభాగమున తాల్చిన దేవా!
డై = వృషభము,
డా = విజయధ్వజముగా కలవాఁడా!
డం = తృతీయనేత్రమందు,
డా = అగ్నిని తాల్చిన విభూ!
డో = దుష్టుల,
డౌ = సంహారమునందు,
డ = రక్తివహించిన ప్రభూ!
డా = శ్రీదేవిని,
డ = వామభాగమున నిలిపికొన్న శ్రీహరిచే,
డా = జయోక్తులతో,
డా = సన్నుతింపబడిన దేవా!
డా = వెన్నెల వంటి,
డై = నందికేశ్వరుని శరీరఛ్చాయ వంటి,
డం = పాల వంటి,
డూ = ఆదిశేషుని వంటి,
డి = గౌరీదేవి వంటి,
డౌ = కామధేనువు వంటి,
డ = శంఖము వంటి,
డ = చంద్రుని వంటి,
డ = అమృతము వంటి, డా=తెల్లని దరహాసము గల ఱేఁడా!
డం = గాయనుల యొక్క,
డ = స్తోత్రములచే,
డ = ప్రసన్నుఁడ వగు,
డ = సర్వేశ్వరుఁడవైన,
డ = పరమేశ్వరా!
డం = దుర్మతులకు,
డ = త్రాసమును కలిగించు,
డం = డమరువు యొక్క,
డ = భీషణమైన ధ్వని కలవాఁడా!
డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం.


విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.

ఏకాక్షర శ్లోకం -2

ఏకాక్షర శ్లోకం

యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా 
||

పదవిభాగం 
యాయాయా, ఆయ, ఆయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, అయాయ, ఆయాయాయ, ఆయాయాయ, ఆయాయా, యా, యా, యా, యా, యా, యా, యా, యా. 

తాత్పర్యం
భగవంతునికి అలంకారమైన ఈ పాదుకలు  మనకు అన్ని శుభాలను కలిగిస్తాయి. సర్వరోగాలను హరిస్తాయి. నిరంతరం అతని సన్నిధిలో ఉండాలనే మన కోరికను సఫలం చేసే జ్ఞానాన్ని చేకూర్చుతాయి. ఈ పాదుకల వలన మనం ప్రపంచంలోని అన్ని ప్రదేశాలకూ చేరుకోవచ్చు. అటువంటి మహిమాన్వితమైన ప్రభుపాదుకలకు వందనం. 

(శ్రీ వేదాంత దేశికుల ‘పాదుకాసహస్రం’ నుండి)

ఉకార విశిష్ట శ్లోకం

ఉకార విశిష్ట శ్లోకం


క్రింది శ్లోకంలోని అక్షరాలన్నీ కేవలం ఉత్వంతోనే ఉన్నాయి.

ఉరుగుం ద్యుగురుం యుత్సు
చుక్రుశుస్తుష్టువుః పురు 
|
లులుభుః పుపుషుర్ముత్సు
ముముహుర్ను ముహుర్ముహుః 
||

తాత్పర్యం 
దేవతలందరూ యుద్ధానికి వెళ్తూ దేవగురువైన బృహస్పతిని సంతోషంగా, స్థిరంగా ఉండమని, మాటిమాటికి నిద్రావశుడు కావద్దని ప్రార్థించారు.

ఏక వ్యంజన శ్లోకం

                                    ఏక వ్యంజన శ్లోకం

దాదదో దుద్దదుద్దాదీ
దాదదోదూదదీదదోః |
దుద్దాదం దదదే దుద్దే
దాదాదద దదోऽదదః 
||

  ప్రతిపదార్థ
దాదదః =శ్రీ కృష్ణుడు,
దుద్దరుత=వరముల నన్నిటిని,
దాదీ=ఇచ్చువాడు,

దాదదః=పాపములను దహించు వాడు,
దదోః=దుష్టులను,
దూదదీ = శి క్షిం చు వా డు 
దుద్దాదం = మం చి వారిని ,
దుద్దే = కాపాడుట యందు ,
దదదే = దీక్ష గలవాడు 
దదోదదః = ధర్మాధర్మములను ,
దాదా = మిక్కిలిగా ,
ద ద = ధరించువాడు అనగా ధర్మమును ,అధర్మములోని ధర్మమును కాపాడు వాడు


భావం 
శ్రీకృష్ణుడు అన్ని వరాలను ఇచ్చేవాడు, పాపసంహారకుడు, పరిశుద్ధుడు, దుష్టులను శిక్షించి శిష్టులను కాపాడేవాడు, ధర్మరక్షకుడు.
(గూగుల్ లో దొరికిన ఆంగ్లభావానికి నా అనువాదం)

క్రమస్థ సర్వవ్యంజనం

క్రింది శ్లోకంలో అన్ని హల్లులూ వరుసక్రమంలో ఉన్నాయి.

కః ఖగౌఘాఙచిచ్ఛౌజా
ఝూఞ్ జ్ఞోటౌఠీడడంఢణాః 
|
తథోదధీన్ పఫర్బాభీ
ర్మయోऽరిల్వాశిషాం సహః 
||

ఈ శ్లోకం ప్రతిపదార్థాలు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. తాత్పర్యం మాత్రం దొరికింది.

తాత్పర్యం 
విహంగప్రేమికుడు, సంపూర్ణజ్ఞాని, పరబలాపహర్త, శత్రుసంహారకుడు, ఉత్తముడు, సుస్థిరుడు, నిర్భయుడు, సముద్రాలను నీటితో నింపినవాడు, మాయా స్వరూపుడు (అయిన పరబ్రహ్మ) దయ సర్వపాపాలను హరిస్తుంది.
(శ్లోకం శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ నుండి. తాత్పర్యం ‘గూగులమ్మ’ ఇంగ్లీషులో చెప్పినదానికి నా తెలుగు అనువాదం)

చాటు శ్లోకం

కాచాయ నీచం కమనీయ వాచా
మోచాఫల స్వాదు ముచాన యాచే 
|
దయా కుచేలే ధనదత్కుచేలే
స్థితేऽకుచేలే శ్రిత మా కుచేలే 
||
 

అర్థాలు - 

దయా = దయకు
కుచేలే = (కు = భూమికి, చేలం = వస్త్రమైనట్టి) సముద్రమైనవాడూ,
ధనదత్ = కుబేరునిగా చేయబడిన
కుచేలే = కుచేలుడు కలవాడూ,
శ్రిత = ఆశ్రయింపబడ్డ
మా = లక్ష్మీదేవియొక్క
కుచేలే = వక్షఃస్థలం కలవాడూ,
అకుచేలే = కుత్సితం కాని వస్త్రం (పీతాంబరం) కలవాడూ అయిన విష్ణువు
స్థితే = రక్షకుడై ఉండగా
మోచాఫల = అరటిపండు యొక్క
స్వాదు = మాధుర్యాన్ని
ముచా = వర్షించే
కమనీయ = హృద్యమైన
వాచా = వాక్కుతో (కవిత్వంతో)
కాచాయ = గవ్వకోసం
నీచ = అల్పుని
న యాచే = యాచింపను. 


                  (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

శబ్దచిత్రం - 1

సాయాద్యః కరణోరణో రణరణో రాణోరణో వారణో
దత్తా యేన రమారమా రమరమా రామారమా సా రమా |
సశ్శ్రీమానుదయోదయో దయదయో దాయోదయోదేదయో
విష్ణు ర్జిష్ణు రభీరభీ రభిరభీ రాభీరభీ సారభీ 
|| 

పదవిభాగం -
సాయాత్, యః, కరణః, అరణః, రణరణః, రాణః, రణః, వారణః, దత్తా, యేన, రమా, ఆర, మా, రమ, రమా, రామా, అరమా, సా, రమా, సః, శ్రీమాన్, ఉత్, అయ, ఉదయః, అదయదయః, ఉత్, అయః, దయః, దే, దయః, విష్ణుః, జిష్ణుః, అభీర, భీ, రభిః, అభీర, ఆభీర, భీ, సార, భీః.


అన్వయం -
యః, కరణః, అరణః, రాణః, రణరణః, రణః, ఉ, వారణః, ఆర, మా, రమా, రమ, ఆరమా, రమా, యేన, రామా, సా, రమా, దత్తా, ఉత్, అయ, ఉదయః, అదయదయః, దయః, దాయ, ఉత్, అయః, దే, దయః, అభీర, భీ, రభిః, ఆభీర, భీ, సార, భీః, శ్రీమాన్, జిష్ణుః,సః, విష్ణుః, పాయాత్.


ప్రతిపదార్థాలు -
యః = ఏ విష్ణువు
కరణః = జలాన్ని పొందియున్నవాడో 

(కం = జలం, రణతి = గచ్ఛతి; ఇతి కరణః)
(మత్స్యకూర్మరూపాలను దాల్చినవాడో),
అరణః = యుద్ధవ్యాపారం లేనివాడో 

(వామనుడై యుద్ధం చేయకుండానే బలి నణచినవాడో),
(యస్య = ఎవనియొక్క)
రాణః = యుద్ధసంబంధమైన
రణరణః = ‘రణరణ’ అనే ధ్వని
రణః = యుద్ధం వల్ల కలిగే
ఉ = వ్రణాలు మొదలైన చిహ్నాలు కల వీరులను
వారణః = నివారించినదై ఉన్నవాడో
(దేవభటుల అవసరం లేకుండా నృసింహరూపంతో హిరణ్యకశిపుని చంపినవాడో),
ఆర = శత్రుక్షత్రియ సమూహాన్ని
మా = పరశురామరూపంతో చంపి
రమా = లక్ష్మితో
రమ = రమించే విష్ణువునందు
ఆరమా = మిక్కిలి రమించే తాపసులను
రమా = రమింపజేసే
యేన = ఏ విష్ణువు చేత
రామా = రమణీయమైన
సా = అటువంటి
రమా = భూమి అనే రాజ్యలక్ష్మి
దత్తా = బ్రాహ్మణులకు ఇవ్వబడిందో,
ఉత్ = ఉద్ధరింపబడిన
అయ = నీట మునిగిన
ఉదయః = ఉదయాచలం మొదలైనవి గల భూమి కలవాడో
(వరాహరూపం దాల్చినవాడని భావం),
అదయదయః = అదక్రూరులపై కూడ
దయః = దయగలవాడో (బుద్ధరూపంతో క్రూరులను ఉద్ధరించినవాడని భావం),
దాయ = రాజ్యభాగం కోసం
ఉత్ = ఎత్తబడిన
అయః = లోహనిర్మితశస్త్రాలు కల కౌరవులను
దే = చీల్చిన అర్జునుని యందు
దయః = కృప గలవాడో (కృష్ణుడని భావం),
అభీర = పరదారాపహరణ పాపానికి భయపడని రావణాదుల యందు
భీ = భయావహమైన
రభిః = యుద్ధరాభసం (తీవ్రత) కలవాడో (రాముడని భావం),
అభీర = శూరులయందు
ఆభీర = భీరువులయందు
భీ = సమానంగా భయాన్ని
సార = ప్రసరింపజేసిన మ్లేచ్చులకు
భీః = ప్రాణభయాన్ని కలిగించేవాడో (కల్కి అని భావం)
శ్రీమాన్ = నిత్యలక్ష్మి కలవాడూ
జిష్ణుః = జయశీలుడైనవాడూ
సః విష్ణుః = సర్వవ్యాపియైన ఆ నారాయణుడు
పాయాత్ = మిమ్ము బ్రోచుగాక!


                   (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

శబ్దచిత్రం


శబ్దచిత్రం


యావత్తోయధరా ధరా ధర ధరాధారాధర శ్రీధరా
యావచ్చారుచచారుచారుచమరం చామీకరం చామరమ్ 
|
యావద్రావణరామ రామరమణం రామాయణం శ్రూయతే
తావద్భో భువి భోగభోగ భువనం భోగాయ భూయాద్విభో 
||


పదవిభాగం -
యావత్, తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరా, యావత్, చారు, చచా, రు, చారు, చమరం, చామీకరం, చ, అమరం, యావత్, రావణరామ, రామ, రమణం, రామాయణం, శ్రూయతే, తావత్, భో, భువి, భోగభోగ, భువనం, భోగాయ, భూయాత్, విభో.


అన్వయం -
తోయధరాః, ధరా, ధర, ధరా + ఆధార, అధర, శ్రీధరాః, యావత్, చ, చారు, చచా, రు, చారు, చమరం, అమరం, చామీకరం, యావత్, రావణరామ, రామ, రమణం, రామాయణం, భువి, యావత్, శ్రూయతే, తావత్, భోగభోగ, భో విభో, భువనం, భోగాయ, భూయాత్.

ప్రతిపదార్థాలు - 
తోయధరాః = సముద్రాలు
ధరా = భూమి
ధర = పర్వతాలు
ధరా + ఆధార = భూమికి ఆధారమైన
అధర = అధోలోకంలో ఉండే
శ్రీధరాః = విషధరుడైన ఆదిశేష సర్పం (లేదా లక్ష్మిని ధరించిన కూర్మం)
యావత్ = ఎప్పటివరకు (ఉంటాయో)
చ = మరియు
చారు = మనోజ్ఞమైన
చచా = ‘చచ’ అనే
రు = ధ్వనిని చేసే
చారు = అందమైన
చమరం = చమరమృగాలు కల
అమరం = దేవతలకు సంబంధించిన
చామీకరం = స్వర్ణనిలయమైన మేరుపర్వతం
యావత్ = ఎప్పటివరకు (ఉంటుందో)
రావణరామ = రామ రావణు లనే
రామ = జగత్తు నాకర్షించే
రమణం = నాయక, ప్రతినాయకులు కల
రామాయణం = రామాయణం
భువి = భూమిపైన
యావత్ = ఎప్పటివరకు
శ్రూయతే = వినిపిస్తుందో
తావత్ = అప్పటివరకు
భోగభోగ = భోగాలకు భోగభూతుడవైన
భో విభో = ఓ రాజా!
భువనం = భూమండలం
(తే) భోగాయ = నీ అనుభవం కోసం
భూయాత్ = అగును గాక! 


                (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

పాదానులోమ ప్రతిలోమ శ్లోకం

పాదానులోమ ప్రతిలోమ శ్లోకం


కాళీనానననాళీకా
రాధితాహిహితాధిరా |
మాయాసామమసాయామా
కాపిదీప్రప్రదీపికా 
||
(ఈ శ్లోకంలో ఏపాదానికి ఆ పాదం ఎటునుండి చదివినా ఒక్కటే!)

పదవిభాగం -
కాళీ, ఈన, ఆనన, నాళీక, ఆరాధితా, హి, హిత, అధి, రా, మా, యా, సా, మమ, సా, ఆయామా, కాపి, దీప్రప్రదీపికా.


అన్వయం -
కాళీ, ఇన, ఆనన, నాళీక, ఆరాధితా హి, హిత, అధి, రా, యా మా, సా, ఆయామా, సా, మమ, కాపి, దీప్రప్రదీపికా.


ప్రతిపదార్థాలు 
కాళీ = పార్వతి యొక్క
ఇన = భర్త అయిన శంకరుని
ఆనన = వదన మనే
నాళీక = పద్మం చేత
ఆరాధితా హి = స్తుతింపబడేడీ,
హిత = భక్తుల యొక్క
అధి = మనోవ్యధను
రా = తొలగించేదీ (అయిన)
యా మా = ఏ లక్ష్మీదేవి
సా = (భక్తులపట్ల) దయ యొక్క
ఆయామా = దీర్ఘత కలిగినదై ఒప్పుతున్నదో
సా = అటువంటి లక్ష్మీదేవి
మమ = నాకు
కాపి = అనిర్వచనీయమైన
దీప్రప్రదీపికా = ఎల్లప్పుడు ప్రకాశించే దీపిక అగును గాక!  
 

భాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

ద్వ్యక్షరశ్లోకం

ద్వ్యక్షరశ్లోకం

 కాలేకిలాలౌకికైక
కోల కాలాలకే లల |
కలికాకోలకల్లోలా
కులలోకాలి లాలికా 
||

పదవిభాగం -
కాలేకిల, అలౌకిక, ఏక, కోల, కాల + అలకే, లల, కలి, కాకోల, కల్లోల, ఆకుల, లోక + ఆలి, లాలికా.


అన్వయం -
అలౌకిక, ఏక, కోల, కాల + అలకే, కలి, కాకోల, కల్లోల, ఆకుల, లోక + ఆలి, లాలికా, కాలేకిల, లల.


ప్రతిపదార్థాలు - 
అలౌకిక          = లోకవిలక్షణమైన
ఏక                 = ముఖ్యమైన
కోల               = ఆదివరాహం యొక్క
కాల + అలక = నల్లని ముంగురులు గల భార్యవైన ఓ లక్ష్మీ!
కలి               = కలికాలమనే
కాకోల          = విషం యొక్క
కల్లోల          = విజృంభణం చేత
ఆకుల          = బాధపడుతున్న
లోక + ఆలి   = ప్రజాసమూహాన్ని
లాలికా         = రక్షిస్తున్న (నీవు)
కాలేకిల       = అపాయసమయంలో మాత్రం
లల              = సాక్షాత్కరించి ప్రకాశించు. 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

చమత్కారo

కాకాననదేదేవివిసాసాహహభూభూ
రారాదదరారామమనానామమహేహే |
యాయామమఖేఖేదదనానాఘఘనానా
త్వంత్వంగగదాదావవనీనీతతమామా ||


పదవిభాగం -
కాక, అననదే, దేవి, విసాసా, హహ, భూభూః, ఆరాత్, అదరా, రామమనాః, నామ, మహా, ఈహే, యాయాః, మమ, ఖే, ఖేదద, నానా+అఘ, ఘన, అనా, త్వంతు, అంగ, 
గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, మా.

అన్వయం -
కాక, అననదే, భూభూః, నామ, మహా, ఈహే, అంగదేవి, విసాసా, అదరా, రామమనాః, ఖే, ఖేదద, నానా + అఘ, ఘన, అనా, గద + ఆదౌ, అవనీ, నీత, తమాః, త్వంతు, మమ ఆరాత్, మా యాయా.


ప్రతిపదార్థాలు -
కాక = కాకాసురునికి
అననదే = రక్షణ నిచ్చినదానా!
భూభూః = భూమినుండి పుట్టినదానా!
నామ = నమస్కారమందు
మహా = గొప్పనైన
ఈహే = అభిలాష కలదానా!
అంగదేవి = ఓ సీతాదేవీ!
విసాసా = నిర్దోషురాలవు,
అదరా = భయం లేనిదానివి,
రామమనాః = రాముని యందే మనస్సు కలదానివి,
ఖే = మనస్సులో
ఖేదద = దుఃఖాన్ని కలిగించే
నానా + అఘ = రకరకాలైన పాపాలచేత
ఘన = దుర్బలులైనవాళ్ళను
అనా = రక్షించేదానివి,
గద + ఆదౌ = రోగాలు మొదలైనవాటినుండి
అవనీ = జనులను కాపాడేదానివి.
నీత = తొలగింపబడ్డ
తమాః = తమోగుణం కలదానివై
త్వంతు = నీవు మాత్రం
మమ ఆరాత్ = నాకు దూరంగా
మా యాయా = వెళ్ళకు సుమా! 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం -1

ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం

మామామ మా మమేమామా
మామూమామేమమేమమే 
|
మామామేమిమిమేమామ
మమోమామామమామమీ 
||


పదవిభాగం -
మామ్, ఆమ, మా, మమ, ఇమాం, ఆమామూమ, అమేం, అమ, ఈం, అమే, అమామ్, అమః, మేమి (మా + ఏమి), మిమే, మామం (మా + అమం), అమః, మామామ (మా + అమామ), మామ్, అమీ.


అన్వయం -
మమ, మా, ఇమాం, మామ్, ఆమ, అమేం (అమా + ఈం), ఈం, అమ్, ఆమామూమ, అమే, మే, అమ, అమామ్, మేమి (మా + ఏమి), అమః, మామం (మా + అమం), మిమే, అమీ, మామ్, మామామ (మా + అమామ).


ప్రతిపదార్థాలు -
మమ = నా యొక్క
మా = బుద్ధి
ఇమాం మామ్ = ఈ లక్ష్మిని
ఆమ = పొందెను.
అమేం -
అమా = సహితురాలైన
ఈం = లక్ష్మి గల
అమ్ = నీ పాదాన్ని
ఆమామూము = ఆశ్రయించాము.
అమే = ఓ దుర్బుద్ధీ (జ్యేష్ఠాదేవీ)!
మే = నాకు
అమ = దూరంగా వెళ్ళు.
అమామ్ = లక్ష్మికంటె వేరైన దేవతను
మా + ఏమి = పొందను.
అమః = బంధరహితుడనై
మా = లక్ష్మి యొక్క
అమమ్ = ప్రాపును
మిమే = అపేక్షిస్తాను.
అమీ = ఈ మేము
మామ్ = ప్రమాణమైన శాస్త్రాన్ని
మా + అమామ = అతిక్రమింపము. 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

ఏకాక్షర (ఏకవ్యంజన) శ్లోకం

రరోరరే రరరురో
రురూరూరు రురోరరే 
|
రేరే రేరారారరరే
రారేరారి రి రారిరా 
||

పదవిభాగం -
ర, రోః, అరేః, అర, రురోః, ఉః, ఊరూరుః, ఉరః, అరరే, ర, ఈరే, రీరారా, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.
 
అన్వయం -
ర, రోః, అర, రురోః, అరేః, ర, ఈరే, ఉరః, అరరే, రీరారా, ఊరు + ఊరుః, ఉః, అరరర, ఇరార, ఇరారి, రిః, ఆరి, రా.

 ప్రతిపదార్థాలు -
ర = రామశబ్దంలోని రేఫ (రకారం) వలన
రోః = భయం కలవాడైన,
అర = వేగంగా పరుగెత్తే
రురోః = హరిణరూపంలో ఉన్న మారీచునికి
అరేః = శత్రువైన శ్రీరాముని యొక్క
ర = కౌస్తుభమణిని
ఈరే = పొంది ఉన్న
అరః + అరరే = కవాటంవంటి వక్షస్థలంలో
రీరారా = లీల నాపాదించే (రలయో రభేదః)
ఊరు + ఊరుః = తొడలచే గొప్పదైన
ఉః = సీత భూమిక దాల్చిన లక్ష్మిని
అరరర = తన నిలయానికి తీసికొని వెళ్ళిన
ఇరార = సముద్రద్వీపాన్ని (లంకను) పొంది ఉన్న
ఇరారి = భూమికి విరోధి అయిన రావణునకు
రిః = నాశనాన్ని కల్గించిన దగుచు
ఆరి = చెలికత్తెలను
రా = పొందింది. 


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారి ‘ప్రహేళికలు’ సంకలనం నుండి)

చతుర్విధ కందం

*సురరాజ వినుత నిర్మల
చరితా! *పరమాంతరంగ! సజ్జన వరదా!
*నరవర! విశేష పావన
చరణా! *కరుణా నిధాన! సత్పథ నిరతా!

ఈ కందపద్యంలో 4 * గుర్తులున్నాయి. ఏ గుర్తునుండి మొదలుపెట్టినా పద్యాన్ని అర్థవంతంగా చదువుకొన వచ్చు. ఆ విధంగా 4 పద్యాలను ఇక్కడ చూడవచ్చు.

ప్రథమ కందం ....
సురరాజ వినుత నిర్మల
చరితా! పరమాంతరంగ! సజ్జన వరదా!
నరవర! విశేష పావన
చరణా! కరుణా నిధాన! సత్పథ నిరతా!

ద్వితీయ కందం ....
పరమాంతరంగ! సజ్జన 
వరదా! నరవర! విశేష పావనచరణా! 
కరుణా నిధాన! సత్పథ 
నిరతా! సురరాజ వినుత నిర్మలచరితా! 

తృతీయ కందం ....
నరవర! విశేష పావన
చరణా! కరుణా నిధాన! సత్పథ నిరతా!
సురరాజ వినుత నిర్మల
చరితా! పరమాంతరంగ! సజ్జన వరదా!

చతుర్థ కందం ....
కరుణా నిధాన! సత్పథ 
నిరతా! సురరాజ వినుత నిర్మలచరితా! 
పరమాంతరంగ! సజ్జన 
వరదా! నరవర! విశేష పావనచరణా! 

శ్రీ పండిత నేమాని రామజోగి సన్యాసి రావు గారి
‘శ్రీమదధ్యాత్మ రామాయణము’ నుండి