చంద్రబింబానన, చంద్రరేఖామౌళి నీలకుంతలభార, నీలగళుఁడు
ధవళాయతేక్షణ, ధవళాఖిలాంగుండు మదనసంజీవని, మదనహరుఁడు
నాగేంద్రనిభయాన, నాగకుండలధారి భువనమోహనగాత్ర , భువనకర్త
గిరిరాజకన్యక, గిరిరాజనిలయుండు సర్వాంగసుందరి, సర్వగురుఁడు
గిరిరాజకన్యక, గిరిరాజనిలయుండు సర్వాంగసుందరి, సర్వగురుఁడు
గౌరి, శ్రీ విశ్వనాథుండు కనకరత్న
పాదుకలు మెట్టి, చట్టలు పట్టుకొనుచు
నందికేశుండు ముందట నడచిరాఁగ
నరుగుదెంచుట యద్భుతమయ్యె మాకు.
. పై సీసపద్యములోనినాలుగు పాదాల్లోనూ పార్వతిని, పరమేశ్వరుణ్ణి ప్రతి పాదములో ప్రస్తుతించాడు శ్రీనాథుడు!
- గౌరీదేవి చంద్రబింబము వంటి ముఖసౌందర్యము కలిగివున్నది. (ఆననము అంటే ముఖము).మరి, శంకరుడేమో చంద్రరేఖను (నెలవంకను) తలపై ధరించివున్నాడు.
- ఆమె నల్లని దట్టమైన కురులను కలిగివుంది. అతడు నల్లని కంఠం కలవాడు. (సంస్కృతములో ' నీల' అనే పదానికి ' నలుపు ' అనే అర్థం వుంది.) క్షీరసాగరమధన సమయములో బయల్వెడలిన హాలాహలాన్ని లోకరక్షణార్థమై పరమేశుడు స్వీకరించి తన కంఠాన నిలిపిన గాథ సుప్రసిద్ధం కదా!
- ఆమె తెల్లని విశాలమైన కన్నులు కలిగివుంది. అతడు తెల్లని శరీరకాంతితో ప్రకాశిస్తున్నాడు.
- మరణించిన మన్మథుణ్ణి సైతం తిరిగి బ్రతికింపజేయగల సౌందర్యం ఆ తల్లిది. ఆయనేమో తన ఫాలాగ్నిలో మదనుణ్ణి భస్మం చేసినవాడు.
- ఆమె ఏనుగు నడక వంటి మందగమనం కలిగివుంది. (' నాగము ' అంటే ఏనుగు అనే అర్థం వుంది.)స్త్రీలను ' గజగమనలు ' అని వర్ణించడం కవులకు పరిపాటే! మరి, శివుడేమో నాగాభరణుడు. సర్పములనే అలంకారములుగా ధరించినవాడు.
- సర్వలోకాలనూ సమ్మోహితం చేయగలిగిన సురుచిర శరీర సౌందర్యం సర్వమంగళది. ఆయనేమో సాక్షాత్తూ విశ్వనాథుడే! సర్వలోకాలకూ కర్త.
- ఆమె గిరిజ. అనగా గిరులకే రాజైన హిమవంతుని ముద్దులపట్టి. ఇక ఆయన కైలాస పర్వతమునే తన నివాసంగా చేసుకున్నవాడు.
- అన్ని అవయవములు పొందికగా అమరిన సర్వాంగసుందరి ఆమె. ఆయన సర్వులకూ గురువు;జగద్గురువు.
పైవిధంగా ఆ ఆదిదంపతులు, తమ వాహనమైన నందీశ్వరుడు ముందు నడవగా అద్భుతమైన రీతిలో సాక్షాత్కరించారు.
మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలా, శ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం.
మహాదేవుని అర్ధనారీశ్వరతత్వం ప్రతిఫలించేలా, శ్రీనాథ కవీంద్రుడు వారిద్దరినీ ఒకేవిధమైన విశేషణాలు వినియోగిస్తూ విలక్షణరీతిలో వర్ణించిన ఈ పద్యప్రసూనం సహృదయరంజకం.
No comments:
Post a Comment