Tuesday, March 25, 2014

మృడుని కనుగొన్న పులకింత

మృడునిఁ గనుగొంటి
సీ.
అర్థంబు సత్పురుషాకృతి గాంచిన

వెండిచాయల పెద్ద కొండఁ గంటి
నా కొండ పార్శ్వమం దంటి పాయఁగలేక
సగమైన యొక మహాశక్తిఁ గంటి
నా శక్తి కుడివంక నద్రిశృంగము మీఁద
నద్భుతం బైన కాఱడవిఁ గంటి
న క్కానలోఁ గంటి నరుదైన యొక యేఱు
న య్యేటి దరులయం దమృత మొలుక
గీ.
పాఱి తడుపారు నొక పాలపాఁపఁ గంటి
నదియు నదియును నదియును నదియు నదియు
హరశిరోజూటగంగాబ్జు లగుట గంటి
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.


సీ.
శీతాద్రి యామ్య దిక్సీమ భూములు గంటిఁ

జెలువైన కేదారశిఖరిఁ గంటి
నుగ్రుని నిజకాంత నుమఁ జెంతఁ గనుఁగొంటి
మధుమాధవుని దైత్యమథనుఁ గంటిఁ
గంటి విఘ్నేశ్వరు గణనాథుఁ గనుఁగొంటిఁ
జండభైరవుని గోస్వామిఁ గంటి
నుత్తమ సంస్తుత్యు నుత్తరార్కునిఁ గంటిఁ
గాలభైరవు ఛన్నఘంటఁ గంటిఁ
గీ.
గంటి వటవృక్ష మాదిమగంగఁ గంటిఁ
గంటిఁ గేదార కుండోదకములు గ్రోలి
మహిత వృషరాజు నెక్కిన మహిమవాని
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.


సీ.
ఆలపోతులఱేని నాతని పగవానిఁ

బెంపంగఁ జంపంగఁ బెంపు గలిగి 
హాలాహలపు మందు హల్లకముల విందుఁ
గుడువంగ ముడువంగఁ గోర్కె గల్గి
యెడమదిక్కు వధూటి జడల మక్కువబోటిఁ
బొలపింప వలపింపఁ బొందు గలిగి
పచ్చి యేనికతోలు ప్రాఁత కంగటికాలు
కట్టంగఁ బట్టంగఁ గణఁక గల్గి
గీ.
యెసఁగి లోకంబు లీరేడు నేలువాని
మిగులఁ బొడవైన తెల్లని మేనువాని
మహిత వృషరాజు నెక్కిన మహిమవాని
మృడునిఁ గనుఁగొంటి నంతట మేలుకొంటి.


1 comment:

Ayyagari Surya Nagendra Kumar said...

చాలా బాగుందండీ అద్భుతః.. నేను దీన్ని నేర్చుకోడానికి కాపీ చేసుకుంటున్నాను...