Thursday, March 20, 2014

చాటువులు

చేకొని రాయని బాచడు
కాకాలు గుణించు పిన్న కాలము నాడే
లాకేత్వ మియ్య నేరడు
దాకును కొమ్మియ్యడిట్టి ధన్యులు గలరే !!


వాసన లేని పువ్వు బుధ వర్గము లేని పురంబు నిత్య వి
శ్వాసము లేని భార్య గుణవంతుడు కాని కుమారుడున్ సద
భ్యాసము లేని విద్య పరిహాస ప్రసంగము లేని వాక్యమున్
గ్రాసము లేని కొల్వు కొర గానివి పెమ్మయ సింగ ధీమణీ !!


చేతనగు వాడు కార్యము
కై తగ్గును వంగు గాక యల్పుండగునా ?
ఏతము వంగిన వంగును
పాతాళము నీరు తెచ్చి బయలన్ జల్లున్ !!


ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడుకంచు తిట్టగా విని "అయ్యో!
వీడా నాకొక కొడుక" ని
గాడిద ఏద్చెంగదన్న ఘన సంపన్నా!
(పాఠాంతరం ...)
ఆడిన మాటలు తప్పిన
గాడిద కొడుకంచు తిట్టగా విని యేడ్చెన్
"వీడా నాకొక కొడుక" ని
గాడిదయును కుందవరపు కవి చౌడప్పా!


ఒక తుంటరి అబ్బాయి ఈ క్రింది పద్యంలో
"ఒసే! దరిద్రపు దానా! కొంచం సున్నం తెచ్చి పెట్టవే!" ... అంటే


పర్వత శ్రేష్ఠ పుత్రికా పతివిరోధి
యన్న పెండ్లాము అత్తను గన్న తల్లి(/తండ్రి)
పేర్మి మీరిన ముద్దుల పెద్దబిడ్డ
సున్న మించుక తేగదే సుందరాంగి(/సన్నుతాంగి)


( పార్వతి, శివుడు, మన్మథుడు, బ్రహ్మ, సరస్వతి, లక్ష్మి,
సముద్రుడు(/అతని భార్య), జ్యేష్ఠా దేవి (దరిద్ర దేవత) )


ఆ గడసరి అమ్మాయి ఇల "ఓరి కుక్కా! ఇదుగో సున్నం!" అని ఇచ్చిందట !


శతపత్రంబుల మిత్రుని
సుతు జంపినవాని బావ సూనుని మామన్
సతతము దాల్చెడు నాతని
సుతువాహన వైరి వైరి సున్నంబిదిగో


( కమలము, సూర్యుడు, కర్ణుడు, అర్జునుడు, కృష్ణుడు, ప్రద్యుమ్నుడు,
చంద్రుడు, శివుడు, గణపతి, ఎలుక, పిల్లి, కుక్క )


........
రసికత లేనట్టి నరుని బ్రతుకేటి కిసీ
కసవేరుక తిని బ్రతుకదె
పసరము తన కడుపు నిండ పర్వత కొండా !


అన్నాతి గూడ హరుడగు
అన్నాతిని గూడకున్న నసుర గురుండౌ
నన్నా తిరుమల రాయడు
కన్నొక్కటి లేదు గాని కంతుడు గాడే ?!
(పాఠాంతరం ...)
అన్నాతి గూడ హరుడవె
అన్నాతిని గూడనప్పు డసుర గురుడవే
అన్నా! తిరుమల రాయా!
కన్నొక్కటి మిగిలె గాని కౌరవ పతివే !


నేరుతునని మాట్లాడగ
వారిజ భవునంతవాని వశమా తంజా
వూరు రఘునాధ రాయని
గారెరుగగ కుందవరపు కవి చౌడప్పా!

No comments: